- అమరుల బలిదానంతో ఆవిర్భావం
- ఉక్కు సెగ ఢల్లీి పీఠానికి తగలాలి
- బీజేపీయేతర ఎంపిల మద్దతు కోరాలి
- రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
- ఉక్కు ప్రజా గర్జనలో వక్తలు
ఉక్కు ప్రవేటీకరణపై ప్రజలు, నాయకుల గొంతు గొంతు కలిపి గర్జించారు. ఉక్కు త్రిష్ణా మైదానంలో సోమవారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గర్జన విజయవంతం అయ్యింది. ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేఖంగా బిజెపి యేతర రాజకీయ పార్టీల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఉక్కు ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తామని ప్రధాని మోడీ ప్రకటించే వరకూ ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న ధృడ సంకల్పాన్ని సభలో అందరూ వ్యక్తం చేశారు. ఉక్కు సెగ ఢల్లీి పీఠానికి తగలాలని సభలో వక్తలు అన్నారు. వచ్చే బడ్జెట్టు సమావేశంలో బిజేపి యేతర ఎంపిల మద్దతు కూడగట్టి సభలో ప్రధాని మోడీకి ఉక్కు వాణిని గట్టిగా విన్పించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు. విశాఖ ఉక్కు`ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఇప్పుడు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారింది. దేశంలోని తెలుగు ప్రజలు ఉక్కు ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో జరిగిన అతి దీర్ఘకాలిక ఆందోళనలో ఒక రైతు ఉద్యమం కాగా, రెండో ఉక్కుది ఉద్యమంగా చెప్పారు. సభలో పాల్గొన్న అందరూ తమ పార్టీల ఎంపిలను ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేఖంగా ఏకం చేసి పార్లమెంట్‌లో విషయం ప్రస్తావించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. దీంతో ఉక్కు ఉద్యమం సుమారు రెండేళ్ల తర్వాత నిర్వహించిన ప్రజా గర్జనతో మరింత వేడెక్కింది. పోరు బాట పట్టేలా చైతన్యం తెచ్చింది. అందరి నోట ఒకేటే మాట ఉక్కును ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలి. ఉక్కును కారు చౌకగా అమ్మేందుకు పాలకుల చేస్తున్న కుట్రలను తిప్పిగొట్టాలి. ఉక్కును అమ్మేదెవడురా…కొనేదెవడురా అంటూ గొంతెత్తి గర్జించారు. ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ఉద్యమ కారులు ఉక్కు ప్రజా గర్జన సభలో ప్రసంగించారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ పోరాటాలతో వచ్చిందన్నారు. 32మంది బలిదానం, 16వేలకు పైగా రైతుల భూదానంతో ఉక్కు ఫ్యాక్టరీ ఆవిర్భవించిందన్నారు. అటువంటి ఫ్యాక్టరీని ప్రవేటు పరం కానివ్వబోమన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉక్కు ఉద్యమానికి ప్రభుత్వం మద్దతిస్తుందన్నారు. 2ఏళ్లగా సాగుతున్న కార్మిక ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు తెలిపిందన్నారు. తమ ఎంపిలు, మంత్రుల ఉద్యమంలో పాల్గొనేలా సహకరించిందన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం అసెంబ్లీ సాక్షిగా తీర్మానాలు ఆమోదించడంతో పాటు, పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపిలు మోడీకి ఉక్కు ప్రవేటీకరణ వద్దని గట్టిగా చెప్పారన్నారు. మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడ్తున్నట్టు చెప్పడం సరికాదన్నారు. భయం అనే పధం సిఎం జగన్మోహన్‌రెడ్డి డిక్ష్టనరీలోనే లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అంకిత భావంతో కృషి చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదాను గతంలో ఉన్న టిడిపి ప్రభుత్వం పక్కన బెట్టిందన్నారు. అలాగే హిందుస్థాన్ జింక్ విషయంలో టిడిపి వైఖరి అందరికీ తెలిసిందేనన్నారు. పార్లమెంట్ బయట లోపల ఎటువంటి పోరాటాలకైనా తమ పార్టీ సిద్దంగా ఉందని సుబ్బారెడ్డి చెప్పారు.
నాటి ఉద్యమ స్ఫూర్తి నేటి ఉక్కు ఉద్యమానికి అవసరం: సీబీఐ మాజీ జేడీ వి.లక్ష్మీనారాయణ
అమరు వీరుల దినోత్సవం సందర్భంగా ఉక్కు పోరాటంలో ఆసువులు బాసిన 32 మంది అమర వీరులకు జోహర్లు అన్నారు. ఉక్కు ఉద్యమానికి పోరాట స్ఫూర్తి నింపిన టి అమృతరావు, తెన్నేటి విశ్వనాధం, వావిలాల గోపాల కృష్ణయ్య, నాగిరెడ్డి, పుచ్చం పల్లి సుందరయ్య వంటి మహానాయకులెందురో ఉన్నారన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తి నేటి ఉక్కు ఉద్యమానికి అవసరమన్నారు. ప్రజా సభలో ప్రసంగించి అంతటితో అయ్యింది అనుకుంటే చాలదన్నారు. రేపట్టి నుంచి నేను టీవి ముందే కూర్చుంటాను ఉక్కు బడ్జెట్టు సమావే:లో ఉక్కు పోరాట వాణిని పార్లమెంట్‌లో విన్పించే నాయకుని గొంతె వినేందుకు, తెగువ చూసేందుకు అన్నారు. దేశంలో రైతు మోసగింపబడ్తున్నాడన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ పోలాల నన్ని హలా దున్ని ఇలా తలంలో హేమం పిండగ….అన్న శ్రీశ్రీ కవితను ఉద్ఘాటించారు. ప్రభుత్వాలు వ్యాపారం చేయవు అన్న ప్రధాని నరేంద్ర మోడీ పరిశ్రమలు వ్యాపార సంస్థలు కావు ప్రజల జీవన వ్యాపార సంస్థలన్న నగ్న సత్యాన్ని తెలుసు కోవాలన్నారు. ఉక్కు కోసం 16వేలకు పైగా రైతులు భూ ధానం చేస్తే ఇంకా 8500మందికి ఉద్యోగాలు లేక ఉక్కు పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్న దౌర్భాగ్యానికి చింతుస్తున్నానన్నారు. విశాఖ ఉక్కు వేడి ఢల్లీి వరకూ చేరాలన్నారు. ఉక్కు బ్లాస్ట్ ఫర్నేసుకు మించిన వేడి ప్రజా గర్జనతో పుట్టిందన్నారు. ఈ వేడి 2500కిలో మీటర్లు దూరంలో ఉన్న ఢల్లీికి చేరాలన్నారు. విశాఖ ఉక్కు దేశ ప్రజల గుండె చప్పుడన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ వల్లభబాయ్ పటేల్ విగ్రహానికి ఉక్కునిచ్చింది నా విశాఖ స్టీలు అన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన గృహనిర్మాణానికి 21వేల మెట్రిక్ టన్నుల ఉక్కును అందించింది నా విశాఖ స్టీలు అన్నారు. అలాగే హుద్‌హుద్ తుఫాన్‌లో విశాఖ ప్రజలు అల్లకల్లోలం అయితే 9కోట్లు విరాళం ఇచ్చి ఆదుకుంది నా విశాఖ స్టీలు అన్నారు. దేశం కోవిడ్‌తో వణికి పోతూ ప్రాణ వాయువు ఆక్సిజన్ కోసం ఎదురు చూస్తున్న వేళ అనేక రాష్ట్రాలకు ప్రాణ వాయువుని అందించింది నా విశాఖ స్టీలుప్లాంట్ అన్నారు. ప్రతి ఏటా వందల కోట్లు పన్నుల రూపేనా చెల్లిస్తుందన్నది నా ఉక్కు అన్నారు. అటువంటి ఉక్కును ప్రవేటీకరణ కాకుండా కాపాడు కోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. తన వంతుగా రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశానన్నారు. ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ ఉక్కు ప్రవేటీకరణ కాకుండా అడ్డు పడాలన్నారు. అందుకు ప్రతి ఒక్క గొంతూ పాలకుల్ని ప్రశ్నించాలన్నారు. ఉక్కు సెగ ఢల్లీికి తగిలేలా అందరూ ఉద్యమించాలన్నారు.
ఉక్కు ప్రవేటీకరణ నిర్ణయం వెనుక్కు తీసుకోకుంటే పెను ఉప్పెన తప్పదు: వి.వి.రమణమూర్తి, లీడర్ దినపత్రిక సంపాదకులు
రెండేళ్లగా సాగుతున్న ఉక్కు ఉద్యమం రెండేళ్ల తర్వాత ప్రజా గర్జనతో మరింత ఉధృతరూపం దాల్చుతుందన్నారు. ఉత్తరాంధ్ర ఉప్పొంగితుందన్నారు. ఉక్కు ప్రవేటీకరణ నిర్ణయం వెనుక్కు తీసుకోకుంటే పెను ఉప్పెన తప్పదన్నారు. పాలకులు ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. ఉక్కు ప్రవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించ లేక పోయిందన్న విమర్శలనుంచి బయట పడేందుకు తగు విధంగా అధికార పార్టీ ఎంపిలు పార్లమెంట్‌లో ఉక్కు వాణిని గట్టిగా విన్పించాలన్నారు. అప్పులో ఉందన్న సాకుతో స్టీలుప్లాంట్‌ను అమ్మకానికి పెట్టడం వెను పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన బడా పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీలు చేసిన కేంద్రం ఉక్కు విషయంలో అప్పులను ఎందుకు సాకుగా చూపుతుందన్నారు. సర్దార్ వల్లభ బాయ్ పటేల్ విగ్రహానికి 3వేల కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం ప్రభుత్వరంగంలో ఉక్కును కొనసాగించేందుకు కనీసం రుణాన్ని ఈక్వీటీగా ఎందుకు మార్చరన్నారు. పాలకులను ప్రశ్నించాలన్నారు. సొంత గనులు లేకున్నా, ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకొని కార్మికుల శ్రమతో లాభాల భాటపడ్తున్న ఉక్కును ప్రవేటీకరించడం తగదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం భూములిచ్చిన వారిలో 8500మందికి ఇప్పటికీ ఉపాధి లేదన్నారు. కర్ణం వానిపాలెం గ్రామ నిర్వాసితులు కూలీలుగా పూరి పాకల్లో జీవనం సాగిస్తున్నారన్నారు. అలాగే ఉపాధి చూపని ప్రతి నిర్వాసితునికి పాతిక వేల రూపాయలు భృతిని అందజేయాలన్నారు. ఉక్కు ప్రవేటీకరణ విషయంలో మోడీ మచ్చ రాష్ట్ర ప్రభుత్వానికి అంటుకోకుండా ఉండాలంటే ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని ప్రజలు చెప్పాలన్నారు.