విశాఖపట్నం, న్యూస్ లీడర్ సంచలనం కలిగించిన ఎంవీవీ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీల కిడ్నాప్ వ్యవహారం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. వీని డబ్బు కోసం బంధించారా? లేదా మరేదయినా సెటిల్మెంట్ కోసం బంధించారా? విచారణలో ఏమి తేలిందన్నది పోలీసులు ఇప్పటికీ స్పష్టంగా వెల్లడిరచలేదు. కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ జరిగింది అని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విశాఖ పోలీస్ కమీషనర్ త్రివిక్రమ వర్మ ఈ సంఘటనపై మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రజలకు, పలు రాజకీయ పార్టీ నాయకులకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కిడ్నాప్ అనబడే బందీని ప్రజలు మాత్రం విశ్వసించడం లేదు. బందీ అని ఎందుకు అంటున్నారు అంటే కిడ్నాపర్లు అనబడేవారు మూడు రోజుల పాటు ఎంపీ కుమారుడి ఇంట్లోనే ఉన్నారు. ఎంపీ కుమారుడ్ని, భార్యను, ఆడిటర్ జీవీని ఆ ఇంట్లోనే బందించారు. వారిని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అందువల్లనే ‘ఇందులో ఏదో ఉంది’ అని అనుకునే పరిస్థితి ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ప్రజల అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నాలను పోలీసులు చేస్తున్నట్టు కనబడలేదు. డబ్బు కోసమే అయితే కిడ్నాపర్లకు దక్కిన ఒక కోటీ డబ్బయ్ లక్షల రూపాయలు పట్టుకొని వెనువెంటనే వెళ్లిపోయే వారు. కానీ అలా జరగలేదు. పైగా ఇది కిడ్నాప్ కాదు అనే వాదన ఉంది. ఎందుకంటే సంఘటన మొత్తం ఎంవీవీ కుమారుడు శరత్ ఇంట్లోనే కొనసాగింది. గత సోమవారం (జూన్ 12వ తేదీ) రాత్రి, తెల్లవారితే మంగళవారం కరడు గట్టిన నేరస్తుడు, రౌడీషీటర్ కోలా వేంకట హేమంత్ తోపాటు రాజేష్, సాయి అనే ఇద్దరు పాత నేరస్థులు శరత్ ఇంట్లోకి ప్రవేశించారు. ఈ విషయం గురువారం ఉదయం వరకూ ఎంవీవీకి కూడా ఈ విషయం తెలియలేదు అని చెబుతున్నారు. కిడ్నాపర్లు శరత్ ఇంట్లోకి ప్రవేశించిన రెండు రోజుల తరువాత అంటే.. బుధవారం ఉదయం మాత్రమే ఎంవీవీ భార్య జ్యోతిని గంట తేడాలో ఆడిటర్ జీవీని కిడ్నాపర్లు పిలిపించారని చెబుతున్నారు. కేవలం డబ్బు కోసమే అయితే శరత్ ఇంట్లో కిడ్నాపర్లు రెండు రోజుల పాటు అంటే సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకూ మకాం వేసి ఆ రెండు రోజుల్లో డబ్బును ఎందుకు డిమాండ్ చేయలేదు? ఆ రెండు రోజులూ ఏమి జరిగింది? రెండు రోజులూ గడిచిన తరువాతనే ఎంవీవీ భార్య జ్యోతి, జీవీలను రప్పించిన తరువాతనే డబ్బును ఎందుకు డిమాండ్ చేశారు? డబ్బు కోసం అయితే ఎంవీవీ కుమారుడు శరత్‌ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకుపోయి డబ్బును డిమాండ్ చేసి ఉండేవారు కదా… మరి అలా చేయకుండా ఎంవీవీ కుమారుడు శరత్ ఇంటిలోనే రెండు రోజులు మకాం వేయడంలో గల మతలబు ఏమిటి? ఏ కిడ్నాపర్లు అయినా ఎంత వేగంగా డబ్బు గుంజాలో అంత వేగంగా పని ముగించుకుని పారిపోతారు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. డబ్బు కోసమే అయితే ఇంట్లోకి కిడ్నాపర్లు చొరబడిన రోజునే ఎంవీవీ భార్యను, జీవీని రప్పించి ఉండాలి కదా… అలా కాకుండా సావధానంగా సొంత ఇంట్లో ఉన్నట్టే తీరిగ్గా రెండు రోజులు కిడ్నాపర్లు అదే ఇంట్లో ఉన్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పటికే ఈ కిడ్నాప్ వ్యవహారం పై అనేక అనుమానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు విశాఖలో శాంతిభద్రతల పరిస్థితిపై దండెత్తుతున్నాయి. పైగా తాను పీఎం పాలెం ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి హేమంత్‌కుమార్ మూడు రోజులపాటు తన పని మీద ఉంటున్నాడని తెలియజేసినట్టు ఎంపీ కుమారుడు శరత్ చెప్పారు. రౌడీషీటర్ అయిన హేమంత్ కుమార్ రోజు విడిచి రోజు పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉంది.
ఇంతకు ముందే హేమంత్‌కుమార్‌పై రెండు కిడ్నాప్ కేసులు, ఒక మర్డర్ కేసూ ఉంది. ఇలాంటి నేరస్తుడితో మీకు పనేమిటి? అని అడగాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్కు ఉందా? లేదా? పోనీ ఎంపీ గారి కొడుకు ఫోన్ చేశాడు కదా అని ఇన్స్పెక్టర్ కాస్త ఉదాశీనంగా ఉన్నారే అనుకుందాం. ఒక కరుడుగట్టిన క్రిమినల్ ఎంపీ కొడుకు దగ్గర ఉన్నాడని స్పష్టమైన సమాచారం ఉన్న తరువాత కనీసం ఎంపీ కొడుకు ఇంటి దగ్గర కదలికలనయినా ఎందుకు గమనించలేదు? ఇలాంటి ప్రశ్నలు కోకొల్లలుగా వస్తున్నాయి. మూడు రోజులపాటు అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుని భార్యను, కుమారుడ్ని బందించి చిత్రహింసలు పెట్టారంటే కిడ్నాపర్లకు అంత ధైర్యం ఎలా వచ్చింది?
రాష్ట్రంలో అత్యంత ప్రశాంతంగా ఉండే విశాఖలో ఇటువంటి హింసను ఇంతకు ముందు ఇక్కడి ప్రజలెప్పుడూ చూడలేదు. ఈ సంఘటన ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తోంది. ఇప్పటికైనా ఈ కిడ్నాప్ వ్యవహారంలో వాస్తవాలను బయటపెట్టి ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోలీసులు తొలగించాల్సి ఉందని విశాఖ ప్రజలు ఆశిస్తున్నారు.