విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూన్ 20 : ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీల కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు తు.తు. మంత్రంగానే దర్యాప్తు చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ కేసులో నేరంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తుల జోలికి పోలీసులు ఇప్పటికీ పోలేదంటే దర్యాప్తు ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో రౌడీషీటర్ కోలా వేంకట హేమంత్ గర్ల్ ఫ్రెండ్ శుభాలక్ష్మి అత్యంత కీలకం. కిడ్నాప్ ద్వారా హేమంత్ పొందిన సొమ్ములో 40 లక్షల రూపాయలు శుభాలక్ష్మికే చేరాయి. గతంలో జరిగిన ఒక కిడ్నాప్ కేసులో హేమంత్, శుభాలక్ష్మి కలిసి అరెస్ట్ అయ్యారు. అయితే అప్పటి నుంచి హేమంత్‌కు దూరంగా ఉన్నట్టు ఆమె నటిస్తోంది. ఆమెకు దూరంగా ఉంటున్నట్టు హేమంత్ కూడా నటిస్తున్నాడు. కానీ వీరిద్దరి మధ్యా విడదీయరాని బంధం ఉంది. కిడ్నాప్ ప్లాన్‌కు ముందే తాను ఎలాంటి పాత్ర పోషించాలో శుభాలక్ష్మికి తెలుసు. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అంతా ముందుగానే హేమంత్ రూపొందించాడు. అందుకు తగ్గట్టుగానే ఆమె నటించిందన్నది సమాచారం.
ఎంవీవీ కుమారుడు శరత్ ఇంటికి బుధవారం ఉదయం జీవీ వెళ్ళిన తరువాత శుభాలక్ష్మి విషయం బయటకు వచ్చింది. తాను 40 లక్షల రూపాయలు శుభాలక్ష్మికి బాకీ ఉన్నందున ఆమెకు ఈ సొమ్ము చేరవేయాలని జీవీకి హేమంత్ చెప్పాడు. అయితే ఆమెతో ఇప్పుడు తనకు సంబంధాలు లేవని కూడా హేమంత్ జీవీకి తెలిపాడు. అందువల్ల ఆమెతో చనువుగా ఉండే పొట్టి రమణ చేత మాట్లాడిరచడం మంచిదని కూడా హేమంత్ సూచించాడు. పొట్టి రమణ మొబైల్ నెంబరు తన దగ్గర లేదని కూడా హేమంత్ నాటకమాడాడు. పొట్టి రమణ వైసీపీ నాయకుడే అయినందువల్ల ఆయన నెంబరు కోసం ఎంపీ ఆఫీసులో పని చేసే ఒక వ్యక్తిని అడిగి తెలుసుకోమని శరత్‌కు హేమంత్ సూచించాడు. హేమంత్ చెప్పినట్టే శరత్ ఫోన్ చేసి పొట్టి రమణ నెంబరు తీసుకున్నాడు.
హేమంత్ ఒత్తిడితో పొట్టి రమణకు శరత్ ఫోన్ చేసి ‘మాట్లాడే పని ఉంది తన ఇంటికి రావాలని’ పిలిపించుకున్నారు. పొట్టి రమణ వచ్చిన తరువాత అతడి నుంచి శుభాలక్ష్మి మొబైల్ నెంబరు తీసుకొని జీవీ చేత ఆమెతో మాట్లాడిరచారు. హేమంత్ మీకు బాకీ ఉన్న 40 లక్షల రూపాయలను తాను పంపిస్తున్నానని తీసుకోమని జీవీ ఆమెతో చెప్పారు. అయితే ఆమె ఈ సొమ్ము తీసుకోవడానికి నిరాకరించిందని జీవీ చెబుతున్నారు. హేమంత్ ముందుగా ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఆమె హేమంత్‌తో తనకు సంబంధాలు లేవని, నాకు ఈ డబ్బు అక్కరలేదని చెప్పింది. ఇప్పటికే అతనితో కూడి జైలు పాలయ్యానని, మళ్ళీ తప్పు చేయలేనని ఆమె జీవీ ఇవ్వాలనుకున్న సొమ్మును తిరస్కరించింది. హేమంత్ ఒత్తిడి మేరకు జీవీ, శరత్, జ్యోతి కలసి ఆమెను దాదాపు గంటసేపు బతిమిలాడారు. చివరకు హేమంత్ ప్లాన్ ప్రకారమే శుభాలక్ష్మి డబ్బు తీసుకోవడానికి ఒప్పుకుంది. ఆ తరువాత హేమంత్ పొట్టి రమణను బయటకు పంపించేశాడు.
ఆమెను చాలాసేపు బతిమిలాడిన తరువాత ఈ 40 లక్షల రూపాయలూ తీసుకోవడానికి అంగీకరించిందని జీవీ చెబుతున్నారు. అయితే ఇదంతా ఒక డ్రామాగానే నడిచినా జీవీ దృష్టిలో శుభాలక్ష్మికి ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేనట్టుగానే అనిపించింది. కానీ హేమంత్ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే శుభాలక్ష్మి నటించిందన్న విషయం జీవీకి అర్ధం కాలేదు. అందువల్లనే ఆమె పాత్రను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే అసలు కీలకం అంతా ఇక్కడే ఉంది. శుభాలక్ష్మి తనకు మేనకోడలు అంటూ పొట్టి రమణ చెప్పుకుంటాడు. కానీ వీరిద్దరి కులాలూ వేరువేరు. అయితే శుభాలక్ష్మి చాలా కాలంగా రమణతో సన్నిహితంగా ఉంటుందన్న విషయం ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. ఈమెకు 40 లక్షల రూపాయల పంపడం పొట్టి రమణ సమక్షంలోనే జరిగింది. పొట్టి రమణను కిడ్నాపర్లు బుధవారం మధ్నాహ్నమే ఎంవీవీ కుమారుడు శరత్ ఇంటి నుంచి విడిచిపెట్టేశారు. పొట్టి రమణ స్వయంగా తన కళ్ళతో ఈ దురాగతాన్ని చూసినా బయటకు వచ్చాక ఎవరికీ చెప్పలేదంటే దీన్ని ఏ విధంగా పరిగణించాలి? నిర్బంధంలో ఉన్నది ఎవరో అనామకులు కాదు. తన పార్టీ నేత, పైగా పార్లమెంటు సభ్యుడు అయిన ఎంవీవీ భార్య, కుమారుడు. వీరితో పాటు వైసీపీ నాయకుడు, ఆడిటర్ జీవీ. అయినా బయటకు వచ్చిన పొట్టి రమణ గప్‌చిప్‌గా ఉన్నాడంటే హేమంత్‌తో అతడికి ఉన్న సంబంధం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. కనీసం పోలీసులకైనా రమణ సమాచారం ఇవ్వాలి. అది కూడా చేయలేదు.
మరోపక్క శుభాలక్ష్మికి 40 లక్షల రూపాయలు పంపడానికి జరిగిన ఏర్పాటు అంతా రమణకు తెలుసు. ఇంత జరిగినా పొట్టి రమణ బయట ప్రపంచానికి ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీ కాకుండా ఆ ఇంట్లోకి ప్రవేశించిన నాలుగో వ్యక్తి పొట్టి రమణ మాత్రమే. సాధారణంగా అయితే కిడ్నాపర్లు ఎంవీవీ కుటుంబ సభ్యులతో పాటు రమణను కూడా బంధించాలి కదా. అలా చేయకుండా రమణను బయటకు పంపించారు అంటే అతడిపై హేమంత్‌కు ఎంత నమ్మకం ఉందో తెలుస్తోంది.
అంటే రమణను హేమంత్ తన ప్లాన్‌లో ఒక పాత్రగానే వినియోగించాడు. హేమంత్ నమ్మకానికి తగ్గట్టే రమణ బయటకు వచ్చినా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అంటే.. ముందుగా వేసుకున్న ప్లానులో పొట్టి రమణ కూడా ఒక పాత్రధారి అని ఏ పరిజ్ఞానం లేని వారికైనా అర్థం అవుతుంది. మరి రెండు గంటల్లో కిడ్నాప్‌ను చేధించి శభాష్ అనిపించుకున్న పోలీసులు ఇంతవరకూ పొట్టి రమణ కోణంలో ఎందుకు విచారణ చేయడం లేదు? శుభాలక్ష్మి నాటకాన్ని ఎందుకు బయటపెట్ట లేకపోతున్నారు? అంటే ఈ కేసులో పోలీసు విచారణ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
కిడ్నాప్ సొమ్ముతో బంగారం కొనేశారు..
ఎంపీ కుటుంబ సభ్యులు, ఆడిటర్ కిడ్నాప్ వ్యవహారంలో నిందితులు హేమంత్ కుమార్, రౌడీషీటర్ పి.రాజేష్, పాత నేరస్థుడు సాయి కలిసి కాజేసిన రూ.కోటి 75 లక్షలలో కోటికి పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన నగదును రికవరీ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ప్రధాన నిందితులు, ఎంపీ కుమారుని ఇంటి నుంచి ఎవరెవరికి నగదు అందించారో, మనీ ట్రాన్స్ఫర్ చేశారో వివరాలు సేకరించి వారందరినీ పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుడు రాజేష్ పంపిన నగదుతో అతని తల్లి, సోదరి కలిసి బంగారు గాజులు, బంగారు గొలుసు, బంగారు నల్లపూసల దండ కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షల పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
అదేవిధంగా హేమంత్‌కుమార్ ప్రియురాలు శుభాలక్ష్మి నుంచి నగదును, లాయర్‌కు నిందితులు అందించిన రూ.31 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యి జైలులో ఉండగా, కేసుతో సంబంధం ఉన్న మరో 10 మందిని పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం తెలిసింది. ఈ కిడ్నాప్ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి అసలు విషయాలు బయటపెట్టాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.