చిత్తూరు, న్యూస్లీడర్, జూలై 4 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వారి కోసం స్వార్థబుద్ధితో చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసివేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఇప్పుడు తమ హయాంతో చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని, ఇది ఆనందంగా ఉందన్నారు.
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ మంగళవారం శంకుస్థాపణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ డెయిరీని చంద్రబాబు మూసి వేశారని మండిపడ్డారు. నష్టాల్లో ఉందని చిత్తూరు డెయిరీ మూయించేశారని, అదే సమయంలో హెరిడేజ్ డెయిరీ లాభాల్లో ఉండడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఇదంతా చంద్రబాబు మాయాజాలం అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈ హామీ నెరవేర్చానని సీఎం అన్నారు. రూ.182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ పున:ప్రారంభించినట్టు తెలిపారు. అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని సీఎం పేర్కొన్నారు.
చంద్రగిరిలో గెలవలేననే కుప్పం వెళ్లిన చంద్రబాబుకు ఇప్పుడు కుప్పంలో కూడా బాబుకు బైబై అంటున్నారని విమర్శించారు. 54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను అమ్మేసిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. ఎన్నికల వేళ అన్ని తోడేళ్లు ఒకటవుతున్నాయి. విష ప్రచారాన్ని నమ్మకండి. దద్దపుత్రుడు, చంద్రబాబు కలిసి అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు. ఇవాళ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవారి గుండెలో స్థానం కోసం పనిచేస్తున్నాం అని సీఎం చెప్పారు.