తాడేపల్లి, న్యూస్లీడర్, జూలై 4 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయ్తంం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన బుధవారం పధాని మోడీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. సీఎం జగన్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కొన్ని అంశాల్లో జగన్ మద్దతును మోడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి వంటి వివాదాస్పద బిల్లులు కూడా ఉన్నాయి. ఈ బిల్లులు పాస్ కావాలంటే రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు సహకరించాల్సిందిగా జగన్ను మోడీ కోరే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీతో ముఖ్యమంత్రి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.