అచ్యుతాపురం, న్యూస్ లీడర్, జూలై 4 : అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో భద్రతా గాలిలో దీపంగా తయారైంది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా ఆస్పత్రులకు తరలించడానికి కనీసం వసతులు కనిపించవు. గత శుక్రవారం సాహితీ ఫార్మా కంపెనీలో పెద్ద ప్రమాదం సంభవించి అక్కడకక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి ఆస్పత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలాంటి తరుణంలో కార్మికుల రక్షణకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు లేవు. ఏదైనా ప్రమాదం జరిగిన విష విషవాయువులు విడుదలైనా.. మంటలు వ్యాపించినా.. వీరిని రక్షించే నాథుడు లేరు. సెజ్ 208 పరిశ్రమలు ఉంటే ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం మాత్రమే అందుబాటులో ఉంది.
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో 9297 ఎకరాల పరిధిలో 2004లో ప్రత్యేక ఆర్థిక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 22 వేలు మంది మహిళా కార్మికులు పని చేసే బ్రాండిక్స్ అపెరల్ సిటీతో పాటు 208 వరకు రసాయన, ఫార్మా కంపెనీలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయి. వీటిలో మరో 20 వేల మంది వరకు కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈ కంపెనీల్లో ఏదైనా ప్రమాదం జరిగితే గాయపడిన వారిని తరలించడానికి అంబులెన్సు, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక వాహనాలు సైతం లేవు. కొన్ని కంపెనీల్లో వీటిని పేరుకు మాత్రమే నిర్వహిస్తున్నారు.
సెజ్‌లో ప్రమాదం జరిగితే వైద్య సేవల కోసం అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం పరుగులు తియ్యాల్సిందే! అచ్యుతాపురంలో క్లినిక్‌లు ఉన్నా ఒక్క ఆసుపత్రి లోనూ సరైన వైద్య సేవలు అందించే సౌకర్యాలు లేవు. పది మంది రోగులను మంచాలపై ఉంచి వైద్యసేవలు అందించే సదుపాయాలు ఇక్కడ లేవు. అగ్ని ప్రమాదానికి గురైన వారి కోసం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బర్నింగ్ వార్డు ఊసేలేదు. ఈ ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం స్థలం గుర్తింపు వరకే పరిమితమైంది. ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తుప్పలు పెరుగుతున్నాయి కానీ నిర్మాణాన్ని గాలికి వదిలేశారు.
రాంబిల్లి మండల పరిధిలో 3 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలకు కేటాయించారు. వీటి వ్యర్థాలను శుద్ధి చేయడానికి రూ.150 కోట్లతో ఆధునిక కామన్ ఇఫ్యుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ) ఏర్పాటు చేసింది. పరవాడ పారిశ్రామిక ప్రాంతంలోని సీఈటీపీ ప్లాంటులో గతంలో ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం ప్లాంటులో ప్రమాదం సంభవిస్తే పరవాడ కన్నా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ ప్లాంటు చుట్టూ ఉన్నవన్నీ రెడ్ జోన్ పరిశ్రమలే! దీనికి తోడు సీఈటీపీ ప్లాంటు ద్వారా దుర్గంధం వెదజల్లడంతో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఏపీఐఐసీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.