ముంబై, న్యూస్‌లీడర్,జూలై 4 : విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘన, వివిధ సెక్షన్ల కింద దాఖలైన తాజా కేసు వ్యవహారంలో రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయంనకు వచ్చిన ఆమెను అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సోమవారం అనిల్ అంబానీని కూడా ఈడీ అధికారులు విచారించారు. ఈడీ పలు ప్రశ్నలు సంధించి ఆయన సమాధానాలను రికార్డు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే అనిల్ అంబానీని మరోమారు ప్రశ్నించేందుకు నోటీసులు జారీ అయ్యాయి.
విదేశాల్లో కొన్ని వెల్లడిరచని ఆస్తులు, నిధులు మళ్లింపులకు సంబంధించి వీరిని ఈడీ విచారిస్తోంది. కాగా, రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రూ.814 కోట్లను వెల్లడిరచకుండా, రూ.420 కోట్ల పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలపై నల్లధన నియంత్రణ చట్టం కింద గతేడాది ఆగస్టులో ఆదాయపు పన్ను విభాగం అనిల్ అంబానీ నోటీసులు జారీ చేసింది. అనంతరం.. ఆ నోటీసులు, జరిమానాపై బాంబే హైకోర్టు సెప్టెంబరులో మధ్యంతర స్టే ఇచ్చింది. ఇదిలా వుండగా.. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్‌పై దాఖలైన మనీలాండరింగ్ కేసులో భాగంగా 2020లో అనిల్ అంబానీ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.