ఊహించిందే జరిగింది. మెగా కుటుంబంలో ఓ జంట విడాకులకై కోర్టును ఆశ్రయించింది. ఇది అంగరంగ వైభవంగా జరిగిన నీహారిక-జొన్నలగడ్డ చైతన్య పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిన కధ.
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నీహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య కధ. నీహారికను నాగబాబు కుమార్తెగా కంటే యాంకర్‌గా, నటిగా సొంతంగా నిలబడాలనే తత్వం కలిగిన మహిళగా చెప్పవచ్చు. 2020 డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని జైపూర్ కోటలో అంగరంగ వైభవంగా నీహారిక-జొన్నలగడ్డ చైతన్యల పెళ్లి జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి నీహారిక పెళ్లి జరిపించారు. అయితే ఈ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
గత కొద్దికాలంగా ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రేగి విడివిడిగా ఉంటున్నారు. అంతేకాదు..ఇద్దరూ సోషల్ మీడియా ఎక్కౌంట్ల నుంచి తమ భాగస్వాముల ఫోటోల్ని తొలగించి వార్తల్లోకెక్కారు. ముందు జొన్నలగడ్డ చైతన్య తన ఎక్కౌంట్ నుంచి నీహారిక ఫోటోలు తొలగిస్తే..ఆ తరువాత నీహారిక కూడా భర్త చైతన్య ఫోటోల్ని ఎక్కౌంట్ నుంచి డిలీట్ చేసింది. దాంతో ఇద్దరూ విడిపోయారనే విషయం, ఇరువురి మధ్య మనస్పర్ధలొచ్చాయనే విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. త్వరలో విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఆ ప్రచారం నిజమైంది. ఇరువురూ మ్యూచ్యువల్ కన్సెంట్పై కూకట్ పల్లి ఫ్యామిలీకోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని స్వయంగా జొన్నలగడ్డ చైతన్య ప్రకటించారు.