ఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 7 జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాఠశాలలు తిరిగి తెరిచిన మరుసటి రోజే ఓ పాఠశాల బయట గుర్తుతెలియని మహిళను అతిదారుణంగా కాల్చి చంపారు. ఈ తరహా ఘటనలపై భారత్లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మణిపూర్లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు వ్యూహాత్మకమైనవని నేను అనుకోవడం లేదని, ఇలా హింసాత్మక ఘటనల్లో మహిళలు, చిన్నారులు మృతి చెందుతున్నప్పుడు.. వాటి గురించి స్పందించడానికి భారతీయుడినే కావాల్సిన అవసరం లేదు. మీరు కోరితే.. మేం అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది భారత్కు చెందిన అంశమని మాకు తెలుసు. మణిపుర్లో సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాం’ అని గార్సెట్టి అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఘాటుగా స్పందించింది. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఒక అమెరికా రాయబారి భారత అంతర్గత వ్యవహారాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తానెప్పుడూ వినలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ అన్నారు. దశాబ్దాలుగా పంజాబ్, జమ్మూకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఎదురైన ఎన్నో సవాళ్లను నేర్పుతో ఎదుర్కొన్నామని, కానీ ప్రస్తుత స్పందన మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. రెండు నెలలుగా జరుగుతున్న మణిపూర్ ఘర్షణల్లో ఇప్పటివరకు 120 మందికి పైగా మృతి చెందారు. మూడువేల మందికిపైగా గాయపడ్డారు. భారీగా భద్రతాబలగాలను మోహరించి, ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షల వంటివి అమల్లో ఉన్నా కూడా హింసకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. శాంతిస్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతూనే ఉంది.