తేని (తమిళనాడు), న్యూస్ లీడర్, జూలై 7 తమిళనాడులోని తేని నియోజకవర్గ ఎంపీగా ఓపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రవీంద్రనాథ్ 2019 ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి 76,319 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే.. ఆస్తి విషయాలు దాచి, ఓటర్లకు నగదు, బహుమతులు ఇచ్చి ఆయన గెలుపొందారని, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మిలాని అనే స్థానిక ఓటరు హైకోర్టులో ఎన్నికల కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారించకూడదని రవీంద్రనాథ్ తరఫున పిటిషన్ వేసినా.. హైకోర్టు దాన్ని కొట్టివేసింది. అనంతరం పలు దఫాలుగా జరిగిన విచారణలో రవీంద్రనాథ్ మూడుసార్లు కోర్టుకు హాజరై ఆరోపణలు నిరాధారమంటూ వాంగ్మూలం ఇచ్చారు. అప్పట్లో వాదనలు పూర్తిగా విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. గురువారం ఆ వాదనలను పరిగణనలోకి తీసుకొని జస్టిస్ ఎస్ఎస్ సుందర్ తీర్పు వెలువరిస్తూ.. రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదన్నారు. దీనిపై అప్పీల్ చేయడానికి 30 రోజుల గడువిస్తున్నట్లు వెల్లడిరచారు. రవీంద్రనాథ్ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కుమారుడు.