బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ కు గురి చేశాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్.. బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వెల్లడించాడు.
మీడియాతో తమీమ్ మాట్లాడుతూ.. ముఖ్యమైన వన్డే వరల్డ్కప్ ముందు ఇలాంటి నిర్ణయం వద్దని.. వరల్డ్కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని ప్రధాని తనను కోరినట్లు అతడు వెల్లడించాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా చెప్పిన మాటలకి అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నాను అని తెలిపాడు.
స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరమవుతున్నట్లు పేర్కొన్నాడు. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్లు ఆడాలనుకుంటున్నాను అని తమీమ్ తెలిపాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్లు, 241 వన్డేలు, 78 టీ20 మ్యాచ్ లు ఆడాడు.