కళ్యాణదుర్గం, న్యూస్ లీడర్ ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారని, టీడీపీ ఓ గజ దొంగల ముఠాగా ఏర్పడి మళ్లీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏ సీజన్లో పంటనష్టం జరిగినా ఆ సీజన్ ముగియక ముందే పరిహారం అందిస్తున్నాం. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నాం. సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ.58,767 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. 2022 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్ ఇచ్చేలా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని, చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించామని, పశువుల కోసం 340 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని, పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్‌ను తీసుకొచ్చాం’’ అని సీఎం తమ ప్రభుత్వం చేసిన ప్రగతిని వివరించారు.
మనకు ఏ పాలన కావాలో మీరే తేల్చేకోండి…
మనకు పాడిపంటలు ఉండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా?. రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా?. రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా?. పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోండని జనాన్ని ప్రశ్నించారు. గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు, చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అని అంటారని ఎద్దేవా చేశారు. వీళ్లలా మనకు అబద్ధాలు చెప్పడం రాదు’’ అని సీఎం చెప్పారు.