ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన తర్వాత మేల్కోన్న పోలీస్ శాఖ
సిటీ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాల కట్టడికి టాస్క్ఫోర్సే కీలకమంటూ ఆదేశాలు
రూరల్ ఎస్పీ కార్యాలయానికి సీటీఎఫ్ స్టేషన్?
ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు!
తాజాగా ఎనిమింది కానిస్టేబుళ్ల నియామకం
విశాఖపట్నం, న్యూస్లీడర్, జూలై 8: రౌడీలు, గూండాలు, అసాంఘిక శక్తుల పీచమణిచేందుకు ‘సిటీ టాస్క్ఫోర్స్’ పోలీస్ స్టేషన్ మరింత బలోపేతం కానుంది. రౌడీషీటర్ల ఆగడాలు, పేకాట, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా కేసుల నియంత్రణకు ఇకపై ఈ పీఎస్ దుందుడుకు చర్యలు చేపట్టనుంది. ఇన్నాళ్లు కేసులు పట్టుకోవడం, దాడులు చేయటానికి మాత్రమే టాస్క్ఫోర్స్కు వీలుండేది. కేసుల నమోదు మాత్రం సంబంధిత పోలీస్ స్టేషన్లలోనే జరిగేవి. ఇకపై పోలీస్ కమిషనరేట్ మొత్తాన్ని టాస్క్ఫోర్స్ పరిధిలోకి తీసుకువస్తూ, కేసుల నమోదుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. నేడో రేపో టాస్క్ఫోర్స్ బలోపేతానికి వీలుగా సిబ్బంది, అధికారులు, మౌలిక సదుపాయాల పెంపునకు కూడా ఆదేశాలూ రానున్నాయి. తాజాగా సీటీఎఫ్కు శుక్రవారం 8మంది కానిస్టేబుళ్లను నియమిస్తూ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ కూడా ఉత్తర్వులిచ్చారు. నగరంలో ఇటీవల వెలుగు చూసిన ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యులతో పాటు ఆడిటర్ జీవీని కిడ్నాప్ చేసిన ఘటనను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. విశాఖలోని పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులు కూడా సమీక్షించారు. దీంతో టాస్క్ఫోర్స్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
మే 24 నుంచే ఉత్తర్వులు అమల్లోకి..
విశాఖలో 2005లో సిటీ టాస్క్ఫోర్స్ను ప్రారంభించారు. అయితే తొలుత ఈ పీఎస్ బానే ఉన్నా ఆ తర్వాత గండాల్లో పడిరది. ఓ దశలో కనీసం స్టేషన్కు సంబంధించిన బోర్డు కూడా తీసేశారు. సిబ్బంది, మౌలిక సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పేకాట కేసులకే సిబ్బంది పరిమితమయ్యారనే అపవాదునూ మూటకట్టుకుంది. ప్రస్తుతం టాస్క్ఫోర్స్ అంతకు మించి అన్నట్టు దూకుడూ పెంచనుంది. ఇక్కడ ఓ ఏసీపీ, ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు హెచ్సీలు, ఆరుగురు పీసీలు (ఒక రైటర్/ఒక సెంట్రీతో సహా) మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే కనీసం 60మంది సిబ్బందైనా ఉండాలి. విజయవాడలో అదనపు ఎస్పీ స్థాయి అధికారి టాస్క్ఫోర్స్కు అధిపతిగా ఉన్నారు. ఇక్కడ కూడా అదే మాదిరి ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. ఎన్డీపీఎస్, డ్రగ్స్, రౌడీషీటర్ల నియంత్రణ, పేకాట, జూదం, మహిళా సంబంధిత ఫిర్యాదులపై కేసుల నమోదుకు అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా ఫలితాలొస్తాయనే అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ చాలా చిన్నది. కచ్చితంగా భవనం మార్చాలి. అందుకోసం త్రీటౌన్ పీఎస్ సమీపంలో ఉన్న రూరల్ ఎస్పీ కార్యాలయంలో కొంత భాగాన్ని ఉపయోగించే యోచనలో పోలీస్ ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్న విశాఖను త్వరలో పరిపాలనా రాజధాని చేస్తారని భావిస్తున్న తరుణంలో టాస్క్ఫోర్స్ను బలోపేతం చేస్తే సిటీ పరిధిలోని అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పడినట్టేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రతిపాదనలు పంపించినట్టు తెలుస్తోంది.