నెదర్లాండ్స్: వలసల సమస్య నెదర్లాండ్స్ ప్రధాని పీఠానికి ఎసరుతెచ్చింది. దానిపై సంకీర్ణ కూటమిలో సరిదిద్దుకోలేని స్థాయిలో విభేదాలు రావడంతో మార్క్ రుట్టే ప్రధానిగా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాజు విల్లెమ్ అలెగ్జాండర్‌కు అందజేశారు. కూటమిలోని పార్టీలతో కలిసి ఒక ఒప్పందాన్ని రూపొందించడంలో విఫలమైనట్లు రుట్టే వెల్లడిరచారు. నెదర్లాండ్‌ను సుదీర్ఘంగా పాలించిన ఆయన.. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞుడు. 2010లో రుట్టే తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది జనవరిలో ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అయితే వలసలను నియంత్రించే విధానంపై అంగీకారం కుదరకపోవడంతో 18 నెలల్లోనే సంకీర్ణ ప్రభుత్వం గద్దె దిగింది. దీంతో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. విదేశీ శరణార్థులతో వలసల శిబిరాలు కిక్కిరిసిపోయాయి. ఆ సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం చూపుతానని మార్క్ రుట్టే హామీ ఇచ్చారు. ఈ క్రమంలో యుద్ధ ప్రాంతాల నుండి వచ్చే శరణార్థుల బంధువుల సంఖ్య నెలకు 200కు పరిమితం చేస్తానంటూ ఆయన ప్రతిపాదించడంతో అధికార కూటమిలో సంక్షోభం తలెత్తింది. దీనిని కూటమిలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది చివరకు ప్రధాని రాజీనామాకు దారితీసింది.