విశాఖపట్నం, న్యూస్లీడర్, జూలై 8: నోట్ల మార్పిడి వ్యవహారంలో మోసం చేసినందుకు విశాఖలోని ఆర్మ్డ్ రిజర్వు ఇన్స్పెక్టర్ (హోంగార్డుల విభాగం) స్వర్ణలతకు రిమాండ్ విధించారు. ఆమెతో పాటు హోంగార్డు శ్రీను, ఏఆర్ కానిస్టేబుల్ హేమచందర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ సూరిబాబుపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం వీరందర్నీ పోలీసులు కోర్టులో హాజరు పర్చగా ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వీరందర్నీ పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ`4గా ఉన్న స్వర్ణలత తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించగా సోమవారం పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిసింది. అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.
హోంగార్డు శ్రీను దారుణాలు
వాస్తవానికి స్పెషల్ బ్రాంచ్`2లో పని చేస్తున్న హోంగార్డు శ్రీనే ఈ కథంతా నడిపించినట్టు చెబుతున్నారు. శ్రీను గతంలో టూటౌన్లో పని చేసినప్పుడు కూడా పలు దందాలకు పాల్పడేవాడని, సూరిబాబుతో పరిచయం చేసుకుని ఆయన్ను స్వర్ణలత వద్దకు తీసుకు వెళ్లినట్టు తెలిసింది. అంతేకాకుండా ఏఆర్ కానిస్టేబుల్ హేమచందర్ను కూడా రంగంలోకి దించింది శ్రీనేనంటున్నారు. గాజువాకకు చెందిన బాధితుడు కొల్లి శ్రీనుతో మాట్లాడడం, రూ.12.10లక్షలు తేవాలని చెప్పడం, అదే విషయాన్ని స్వర్ణలత బృందానికి చేరవేయడం, అందుకోసం తమ సొంత ఫోన్లను కాకుండా ఇతర ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేయడం వంటివి కూడా శ్రీనే చేయించినట్టు చెబుతున్నారు. శ్రీను గత చరిత్ర కూడా నేరాల మయమేనని పోలీసులే చెబుతున్నారు.
డ్యూటీకి రాకపోయినా సంతకాలు
హోంగార్డు శ్రీను ఇక్కడి స్పెషల్ బ్రాంచి`2లో పని చేస్తున్నాడు. టూటౌన్ పీఎస్ తర్వాత ఆయన్ను ఇక్కడకు గత అధికారి అనేక ఒత్తిళ్లతో తెప్పించారు. ఇదిలా ఉంటే నోట్ల మార్పిడి సంఘటనలో జైలుకు వెళ్లిన ఆర్ఐ స్వర్ణలత కేసులో మరో దారుణం వెలుగు చూసింది. ఆమెతో పాటు నిందితుడిగా ఉన్న హోంగార్డు శ్రీను వారం రోజులుగా డ్యూటీకి వెళ్లడం లేదని సమాచారం. అయినా అప్పుడప్పుడు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసేశాడని తెలిసింది. ఆర్ఐ స్వర్ణలతతో కలిసి నోట్ల మార్పిడి వ్యవహారంలో పాలు పంచుకున్నాడని, సంఘటన జరిగిన రోజు కూడా శ్రీను డ్యూటీకి వెళ్లలేదని, స్వర్ణలతతోనే ఉన్నాడని సమాచారం. అధికారులు అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలిస్తే మాత్రం శ్రీను సంతకం కనిపించడంతో నివ్వెరపోయారు. స్వర్ణలత కూడా హోంగార్డుల విభాగానికి రిజర్వు ఇన్స్పెక్టర్ కావడంతో శ్రీను డ్యూటీకి గైర్హాజరవుతున్నా అధికారులు ఏమీ అనలేకపోయారు. అయితే నోట్ల మార్పిడి వ్యవహారం వెలుగులోకి రావడం, స్వర్ణలతతో పాటు హోంగార్డు శ్రీను, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్, మరో వ్యక్తి సూరిబాబుల్ని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించిడంతో శ్రీను హాజరు విషయాన్ని అధికారులు పరిశీలించారు. ఆర్ఐ స్వర్ణలత ఒత్తిళ్లు ఉండడంతో ఎస్బీ`2లో ఉన్న ఏఎస్ఐ సత్యనారాయణే శ్రీను సంతకాల్ని ఫోర్జరీ చేసేశారని తెలిసింది. దీంతో అధికారులు అక్కడి ఏఎస్ఐతో పాటు విభాగ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీకి రాని వ్యక్తికి అటెండెన్స్ వేసేస్తే.. విధులకు రాని వ్యక్తి రిజిస్టర్లో సంతకాలు చేసేస్తే మనమూ జైలుకు వెళ్లడం ఖాయం అని.. ఇంకోసారి ఇలా చేయొద్దని ఏఎస్ఐపై కోప్పడినట్టు తెలిసింది.