ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రాష్ట్రం పాము పడగనీడలో బిక్కుబిక్కుమంటోంది. ఆ రాష్ట్రంలో హింస కొత్త కాకపోయినా, ఈసారి జరుగుతున్న ఘర్షణలు స్థానికుల మధ్యనే తలెత్తడం ఆందోళన కలిగించే అంశం. మణిపూర్‌లో 60 శాతానికిపైగా ఉన్న మెయితీలకూ 40 శాతం ఉన్న కుకీలు, ఇతర గిరిజన జాతులకూ మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు మణిపూర్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మణిపూర్‌కి మయన్మార్ సరిహద్దులో ఉంది. ఒక్క మణిపూర్‌కే కాక, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరంలకు కూడా మయన్మార్ సరిహద్దు ఉంది. మయన్మార్‌లో గిరిజన తెగల వారు సరిహద్దు రాష్ట్రాల్లోకి చొచ్చుకుని వచ్చి ఘర్షణలకు కారకులవుతున్నారు. ఇది పాత కథ. ఇప్పుడు మెయితీ తెగ వారు షెడ్యూల్డ్ జాతుల్లో చేర్చాలంటూ ఆందోళన సాగిస్తున్నారు. వారిని ఎస్టీల్లో చేరిస్తే తమకు ప్రస్తుతం లభిస్తున్న సదుపాయాలు ఆగిపోతాయని, లేదా తక్కువ అవుతాయనీ కుకీలు, ఇతర గిరిజన జాతుల వారు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా విద్యార్ధులు, యువకులు తమ ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెయితీల ఉద్యమాన్ని ప్రతిఘటిస్తూ కుకీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా ఐదు విద్యార్థి సంఘాల వారు రంగంలో ప్రవేశించడంతో ఉద్యమం హింసాత్మకంగా పరిణమించింది. ప్రభుత్వ వాహనాలనూ, అతిధి గృహాలను ఆందోళనకారులు దగ్ధం చేస్తున్నారు. ఈ ఘర్షణల కారణంగా లక్ష మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఈ ఉద్యమంలో మయన్మార్ గిరిజన తెగలు ప్రవేశించడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఉద్యమకారులను శాంతించాలని కోరినా ఆయన విజ్ఞప్తిని ఎవరూ ఖాతరు చేయలేదు. పరిస్థితి విషమిస్తుండటంతో గవర్నర్ పేరిట కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ వారంలో పరిస్థితి కాస్తా కుదుటపడినా మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంది.
మెయితీలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చవద్దని మిగతా జాతుల వారు ఆందోళన సాగిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌తో సంప్రదిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అసోం రైఫిల్స్, ఇతర బలగాలను ప్రత్యేక విమానంలో ఇంఫాల్‌కి పంపించారు. ఇప్పటికే ముఖ్యమైన ప్రాంతాలను భద్రతాదళాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంవల్ల నిత్యావసరాలు దొరకక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, వదంతుల కారణంగానూ, సమాచార లోపం కారణంగానూ ఘర్షణలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. మణిపూర్‌లో గతంలో జరిగిన అల్లర్లకూ, ఈ ఘర్షణలకూ తేడా ఉంది. బీహార్, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారాల నిమిత్తం వచ్చిన వారు స్థానికులను అణగదొక్కుతున్నారన్న అపోహల కారణంగా గతంలో అల్లర్లు జరిగాయి. ఈ సారి రిజర్వేషన్ల చిచ్చు ప్రధానాంశంగా మారింది.
మెయితీల మాదిరిగానే కొన్ని వర్గాలు ఎస్టీ జాబితాల్లో చేర్చాలని ఆందోళనలు జరుపుతున్నాయి. ఇలా రిజర్వేషన్ల ఇచ్చుకుంటూ పోతే ఆ ఫలితాలు తమకు దక్కవేమోనని ఎస్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఇది ప్రధానమైన సమస్యగా తయారైంది. గతంలో అసోంలోకి విదేశీయులు ప్రవేశించారన్న కారణంగా స్థానికులు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలు ఉద్యమకారులను నాయకులను చేసింది. ముఖ్యంగా అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) నాయకుడు ప్రఫుల్లకుమార్ మహంతా ముఖ్యమంత్రి కాగలిగారంటే వేర్పాటు ఉద్యమ ప్రభావమే. అసోం ప్రస్తుత ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కూడా ఉద్యమాల కారణంగానే నాయకునిగా ఎదిగారు. ఈ ఉద్యమాల వల్ల వ్యక్తులు లాభం పొందుతున్నారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసోం ఉద్యమంలో భాగంగా 80వ దశకంలో నల్లి అనే ప్రాంతంలో ఎంతోమంది మరణించారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇటు మహంతాతో చర్చలు జరుపుతూనే, మరో వంక ఉద్యమాన్ని అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో చిచ్చు రగిల్చేందుకు చైనా అగ్గి రాజేస్తోంది. మయన్మార్‌ని, ఇతర సరిహద్దు దేశాలను ఎగదోసి భారత్‌లో అస్థిర పరిస్థితులను సృష్టిస్తోంది. స్థానికంగా సమస్యలేవీ లేకపోతే పొరుగుదేశాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు మణిపూర్‌లో మెయితీలకూ, గిరిజనులకూ మధ్య అనుమానాలు పెనుభూతమై ఈ ఘర్షణలకు కారణమయ్యాయి. కేంద్ర నాయకులంతా కర్నాటకలో బీజేపీ తరఫున ప్రచారంలో నిమగ్నమైన తరుణంలోనే మణిపూర్ వర్గాలు ఈ ఘర్షణలకు పాల్పడడంతో పథకం ప్రకారమే ఆందోళనలను రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల అనంతరం ఆ అల్లర్లు ఆగిపోయాయంటే ఇవన్నీ రాజకీయ ప్రేరేపణలే. మళ్లీ ఎప్పుడు తలెత్తుతాయో ఎవరికీ తెలియదు. అలా ప్రేరేపించే వారికే తెలియాలి. అందుకే అదో పాము పడగ నీడ.
రాహుల్ గాంధీ పర్యటన…
కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంథీ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించి బాధితుల నివాస శిబిరాలకు వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఇంతవరకు ప్రధాని మోదీ కనీసం తమను పలుకరించలేదని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో రాహుల్ పర్యటనను బాధితులు సాంగానే ఆహ్వానించారు. రాహుల్ రాష్ట్రంలో పర్యటించి బాధితులను పరామర్శించి, తాము అండగా నిలుస్తామని ఓదార్చారు. అయితే ఈ సమయంలో రాహుల్ ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లకపోవడం మంచిదైంది. శిబిరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపచాలని ఆయన కోరారు. ఆహారం, మందులు సరఫరా చేయాలన్నారు. శాంతి అన్నిటికంటే ముఖ్యమైనదని రాష్ట్ర ప్రజలంతా కలిసి సాధించాలని కోరారు. తక్షణం మోదీ మణిపూర్‌లో పర్యటించి సమస్యను పరిష్కరించకపోతే ఆ రాష్ట్రం రావణకాష్టంలా తయారు కావచ్చునని రాహుల్ ఈ సందర్భంగా హెచ్చరించారు. సంక్షోభాన్ని కాస్త ఉపశమనం చేసేందుకుగాను ముఖ్యమంత్రి రాజీనామా నాటకం ఆడించాయని కూడా రాష్ట్రంలో అనేక వర్గాలు భావిస్తున్నాయి.
అమిత్ షా పర్యటన అనంతరం…
అమిత్ షా మణిపూర్‌లో పర్యటించిన తరవాత కేంద్ర ప్రభుత్వం శాంతి సంఘాలను ఏర్పాటు చేసింది. శాంతి సంఘం ఏర్పాటు చేసిన తీరు కూడా వివాదాస్పదమైంది. ఈ సంఘంలో 51 మంది ఉన్నా తమను సంప్రదించకుండానే ఈ కమిటీలో చేర్చారని కుకీలు అంటున్నారు. దానికితోడు మణిపూర్ మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ పి.దొంగెల్ కోసం ప్రత్యేకంగా ఓ పదవి సృష్టించి ఆయనను ప్రత్యేక బాధ్యతలు నిర్వహించే అధికారిగా నియమించారు. రాత్రికి రాత్రి ఈ పదవి సృష్టించి జూన్ ఒకటిన ఆయనను నియమించారు. ఆయన హోం శాఖ పరిధిలో పని చేయాలి. ఆయనను మణిపూర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆయన కూడా ఈ శాంతి సంఘంలో ఉన్నారు. మెయితీలు, కుకీల మధ్య ఘర్షణల వల్ల నిరాశ్రయులైన దాదాపు లక్షన్నర మంది దాదాపు 500 శరణార్థుల శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైన రోజు నుంచి ఇంటర్నెట్ నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలను పట్టుకుంటూనే ఉన్నారు. అయినా హింసాకాండ అదుపు లోకి రావడం లేదు.
కోర్టు తీర్పుతో…
మణిపూర్ హై కోర్టు ముందు వెనక ఆలోచించకుండా మెయితీలను గిరిజనుల జాబితాలో చేర్చాలని తీర్పు చెప్పడం సమస్యను మరింత జటిలం చేసింది. కుకీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. మెయితీలను గిరిజనుల జాబితాలో చేరిస్తే గిరిజన ప్రాంతాలలో కూడా భూములు కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. ఇది గిరిజనుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. పైగా ఈ వెసులుబాటు వల్ల జనాభా స్వరూపమూ మారిపోతుంది. ఉద్రిక్తత పెరగడానికి అసలు కారణం ఇదే. మెయితీలకు కూడా గిరిజనులకు ఉండే స్థాయి కల్పించాలని హైకోర్టు తీర్పు చెప్పడం వాస్తవాధారంగా చూస్తే సరైంది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఎస్.సి, ఎస్.టి. జాబితాలో ఎవరిని చేర్చాలన్న అంశంపై రాజ్యాంగ బెంచి ఇచ్చిన తీర్పుకు కూడా విరుద్ధం.
దీర్ఘకాలంగా హిందువులుగా గుర్తింపుపొందిన మెయితీలు, గిరిజనులైన కుకీలు ఇతర గిరిజన తెగలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో పాలనా వైఫల్యమే నేటి హింసాకాండకు ప్రధాన కారణంగా విపక్షాలు మండిపడుతున్నాయి.
పరిష్కారం కొనగొనాల్సిందే…
మే నెల 3వ తేదీన మొదట హింస ప్రజ్వరిల్లడానికి, ఆ తర్వాత ఇంతవరకు అల్లర్లు చెలరేగడానికి ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్ తీసుకుంటున్న స్వార్థపూరిత చర్యలేనని వీరు దుయ్యపడుతున్నారు. ఘర్షణలు పసిగట్టడంలో ఇంటెలిజన్సు విభాగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలూ ఉన్నాయి. కుకీలు, ఇతర గిరిజన తెగల ప్రజలు తిరుగుబాటు గ్రూపులుగా మారి ఆధునిక ఆయుధాలను సమకూర్చకున్నారు. అలాగే మెయిటీలలో రెండు సాయుధ గ్రూపులు పనిచేస్తూ వస్తున్నాయి. మే 28న సైన్యం, అస్సాం రైఫిల్స్ దళాలు కొండ ప్రాంతాల్లోనే కూంబింగ్ చేశారు. గిరిజన సమూహాలు ఆయుధాలు కలిగి ఉన్నట్టు గుర్తించామని సైనికులు చెప్పారు. ఒక్కరోజే 40 మంది కుకీ గిరిజనులను హతమార్చామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంతవరకు వందల మంది అమాయకులు హింసాకాండలో మృతి చెందగా 3000లకు పైగా గృహ దహనాలు జరిగాయి. దాదాపు ఏభైవేల మంది మిజోరంకు శరణార్థులుగా వెళ్లారు. మెయితీలకు ఎస్టి హోదా ఇస్తే మణిపూర్ విభజనకు దారితీయవచ్చు. మణిపూర్ పొరుగు రాష్ట్రం మిజోరంలోనూ సాధారణ జీవనం, పరిపాలన పైనా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ మెయితీలకు బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా ఉందన్న అభిప్రాయమే తాజా ఘర్షణలకు, అల్లర్లకు దారితీసింది. ఇప్పటికైనా కేంద్రం చిత్తశుద్ధితో తగిన చర్యలు తీసుకుని మణిపూర్‌లో శాశ్వత శాంతికి పరిష్కారం కనుగొనాలని ఆశిద్దాం.
– చింతాడ కృష్ణారావు, సీనియర్ జర్నలిస్టు