. నోటిఫికేషన్ విడుదలైన తరువాత 15 మంది వరకూ…
. బీజేపీ, తృణమూల్ పార్టీల మధ్య పోటాపోటీ
కోల్‌కతా, న్యూస్ లీడర్, జూలై 8Ñ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో హింస చెలరేగింది. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని టీఎంసీ తమ ట్విటర్ ఖాతాలో వెల్లడిస్తూ…విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిరది. వీరితోపాటు ఇతర పార్టీలకు చెందిన మరో ముగ్గురు మృతిచెందారు. రేజినగర్, తుపాన్‌గంజ్, ఖర్గ్రామ్ ప్రాంతాల్లో మా పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. దోమ్‌కోల్‌లో మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఆ కేంద్ర బలగాలు ఏమయ్యాయి? అని టీఎంసీ మండిపడిరది.
పోలింగ్ కేంద్రాలు ధ్వంసం..
పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. కూచ్‌బెహార్‌లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బ్యాలెట్ పత్రాలను దహనం చేశారు. రాణినగర్లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు. డైమండ్ హార్బర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల్లో పోలింగ్ ప్రారంభానికి ముందే ఓట్లు వేశారని భాజపా ఆరోపించింది. జల్పాయ్గురిలో ఓ టీఎంసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. భాజపా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని తృణమూల్ ఆరోపించింది. ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70వేల మంది రాష్ట్ర పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 73,887 పంచాయతీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2.06 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34 శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90 శాతం విజయం సాధించింది.
ఇప్పటి వరకు 15 మంది బలి
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో జరిగిన అల్లర్లలో 15 మంది చనిపోయినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ముర్షీదాబాద్ జిల్లాలోని కపాస్‌డంగ ప్రాంతంలో చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ మృతి చెందగా, అదే జిల్లాలోని రేజినగర్‌లో జరిగిన నాటుబాంబు పేలుడులో మరో కార్యకర్త మృతి చెందాడు. జిల్లాలోని ఖర్గ్రామ్లో ఓ టీఎంసీ కార్యకర్తను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. అలాగే, ఈస్ట్ మిడ్నాపూర్‌లోని సోనాచురా గ్రామ్ పంచాయతీకి చెందిన తృణమూల్ బూత్ ప్రెసిడెంట్ దేవ్‌కుమార్‌పై బీజేపీ కార్యకర్త సుబల్ మన్నా, ఆయన స్నేహితులు దాడిచేశారు. జల్పాయిగురిలోనూ టీఎంసీ కార్యకర్తపై బీజేపీ కార్యకర్తలు దాడిచేశారు. ఈ హింసాకాండపై అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిరది. మరోవైపు కూచ్‌బెహర్‌లో టీఎంసీ బూత్ కమిటీ చైర్మన్ గనేశ్ సర్కార్‌ను రాంపూర్‌లో పొడిచి చంపారు. మరో ఘటనలో దుండగుల కాల్పుల్లో సీపీఎం కార్యకర్త హఫీజుర్ రహ్మాన్ గాయపడ్డారు. నదియా జిల్లాలో జరిగిన హింసలో మరికొందరు టీఎంసీ కార్యకర్తలు గాయపడ్డారు.