సిద్దిపేట జిల్లాలోని ఓ మండలంలో ఇందిరా క్రాంతి పథంలో పని చేస్తున్న ఏపీఎం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆయన గతంలో పని చేసిన చోట ఇదే తీరుగా వ్యవహరించడంతో బదిలీ చేశారు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. తాజాగా జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలంలో పని చేస్తున్న ఆ ఏపీఎం మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
ఓ మహిళా సీఏ అధికారిణి సంతకం కోసం ఇటీవల ఆయన కార్యాలయంలోకి వెళ్లారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. వెంటనే.. ఆమె ఏడుస్తూ బయటకు రావడాన్ని గమనించిన తోటి సీఏలు లోపలికి వెళ్లి ఏపీఎంను నిలదీశారు. తానేమి తప్పు చేయలేదని బుకాయించిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గతంలోనూ అతను ఇలాగే ప్రవర్తించినట్లు మరో ఇద్దరు సీఏలు ప్రస్తావించారు.
బాధితులతో కలిసి విషయాన్ని వారంతా మండలస్థాయి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఏపీఎంని సస్పెండ్ చేయాలని కోరుతూ.. ఆ ప్రజాప్రతినిధి జిల్లా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డిని వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, ఆ ఏపీఎంను మరో మండలానికి బదిలీ చేసినట్లు తెలిపారు.