ఏపీ ప్రజలకు గుడ్న్యూస్. సరైన వర్షాల్లేక ఇబ్బంది పడుతున్న రైతాంగానికి ఊరటనిచ్చే వార్త. రానున్న మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇందుకు కారణమని వెల్లడించింది.
ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఆశించినమేర లేదు. సాధారణ వర్షపాతంలో పోలిస్తే ఈ ఏడాది ఏపీ, తెలంగాణల్లో 36 శాతం లోటు కన్పిస్తోంది. అదే సమయంలో ఉత్తరాదిన మాత్రం రుతు పననాల ప్రభావం తీవ్రంగా ఉంది. రుతు పవనాలు విస్తరించే క్రమంలో తెలుగు రాష్ట్రాల పైనుంచి ఉత్తరాదికి వెళ్లి అక్కడే స్థిరపడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలు భారీ వర్షాలకు అతలాకుతలమౌతున్నాయి.
కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రాత్రి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. రానున్న ముూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ రాత్రి మాత్రం విశాఖ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంతో పాటు ఉత్తర తమిళనాడుపై ఆవహించి ఉంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాలో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక రేపు, ఎల్లుండి కూడా కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.