మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేసిన వీఆర్ఏకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మహిళ వీఆర్ఏ ఫిర్యాదు చేయనందున కేసు నమోదు చేయలేదని ఎస్ఐ చంద్రమోహన్ చెప్పారు. ఈ ఘటన ఆదివారం కొమురవెల్లి మండలం గురువన్నపేట శివారులో జరిగింది.
తెలంగాణలోని గజ్వేల్ తహసీల్దారు కార్యాలయం పరిధిలోని ఓ వీఆర్ఏ.. పొరుగు మండలంలో పని చేస్తున్న ఓ మహిళ వీఆర్ఏను గత కొన్నాళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇటీవల ఆమె చరవాణికి అశ్లీల చిత్రాలను పంపాడు. తాను చెప్పిన చోటకు రావాలని, లేదంటే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించాడు. మనోవేదనకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంటానంటూ తోటి మిత్రులకు చెప్పింది.
స్నేహితులు ధైర్యం చెప్పి, ఆకతాయి వీఆర్ఏకు బుద్ధి చెప్పాలని పథకం వేశారు. గురువన్నపేట శివారులోని క్రాస్‌రోడ్డు వద్దకు అతడిని రప్పించారు. స్థానికులతో కలిసి దేహశుద్ధి చేశారు. అనంతరం 100కి ఫోన్ చేయగా వచ్చిన పోలీసులకు అప్పగించారు.