విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
నిర్వాహకులు మారుతీ ప్రసాద్‌ను అభినందించిన నేతలు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 10: వైఎస్సార్ జయంతి నేపథ్యంలో చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న పదో ‘వైఎస్సార్ కప్ బాక్సింగ్ పోటీలు’ ఆదివారంతో ముగిశాయి. జిల్లా బాక్సింగ్ క్లబ్ పర్యవేక్షణలో మారుతీ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో స్త్రీ, పురుషులకు (ఓపెన్ చాంపియన్‌షిప్) పోటీలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 40క్లబ్‌ల నుంచి వివిధ కేటగిరీలకు చెందిన 200మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సినీ స్టార్ సుమన్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హాజరై తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని పదేళ్లగా దిగ్విజయంగా నడిపిస్తున్న మారుతీ బాక్సింగ్ క్లబ్ వ్యవస్థాపకుడు, నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతీ ప్రసాద్‌ను అభినందించారు. అనంతరం సుమన్, ‘లీడర్’ సంపాదకులు వీవీ రమణ మూర్తి చేతుల మీదుగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం వీరంతా సుమన్‌ను సన్మానించారు. పోటీల విజేతలకు బహుమతులందజేశారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకెంతో ఇష్టమని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ కప్ బాక్సింగ్ పోటీలకు అతిథిగా రావడం ఇది నాలుగోసారన్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై మారుతీ ప్రసాద్‌ను అభినందించారు.
విజేతలు వీరే
ఈ పోటీల్లో జీవీఎంసీ బాక్సింగ్ క్లబ్ విన్నర్స్‌గానూ, మారుతీ బాక్సింగ్ క్లబ్ రన్నర్స్గానూ నిలిచాయి. ప్రమోటెడ్ బాక్సర్‌గా సంతోష్, బెస్ట్ బాక్సర్‌గా సాంబ, బెస్ట్ లూజర్‌గా ప్రసాద్ నిలిచారు. కార్యక్రమంలో ఏపీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య, బీసీ కార్పొరేషన్ సభ్యులు కందుల మల్లికార్జునరావు, శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ అధినేత పల్లె నాగభూషణరావు, తైక్వాండో కోచ్ ఆనంద్, అర్జున అవార్డు గ్రహీత జయరాం, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ. వెంకటేశ్వరరావు, బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు దల్లి రామకృష్ణారెడ్డి, కె. నూకరాజు, ఆర్వోసీ చైర్మన్ దండు నాగేశ్వరరావు, ఐ. సాయిప్రసాద్, వైసీపీకి చెందిన వివిధ విభాగాధిపతులు బంగారు ప్రకాష్, పసుపులేటి గోపీ, అల్లాడ వెంకటరావు, బంక అప్పారావు, జగ్గుపల్లి నరేష్, బైపిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.