లిథువేనియా, న్యూస్ లీడర్, జూలై 10Ñ ‘తలుపులు తెరిచి ఉన్నాయంటే సరిపోదు. లోపల మేం ఉండాలి’’- నాటో సభ్యత్వంపై ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు. నిజానికి 2008లో జరిగిన రుమేనియాలోని బుకారెస్ట్ సదస్సులోనే ఉక్రెయిన్ను కూటమిలోకి చేర్చుకుంటామన్న హామీని నాటో ఇచ్చింది. కానీ ఆ దేశం చేరికపై తొలి నుంచీ సభ్యదేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. రష్యాతో యుద్ధం పతాకస్థాయిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సభ్యత్వ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని అమెరికా, జర్మనీ భావిస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే ఆలస్యమైందని.. కూటమిలోకి ఉక్రెయిన్ను ఆహ్వానించాలని, సత్వరం సభ్యత్వం ఇవ్వాలని అంటున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి లిథువేనియాలోని విల్నిస్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా కూటమిలోని ప్రముఖ నేతలంతా పాల్గొననున్న నాటో సదస్సు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది.
.
ఇస్తాం.. కానీ..!
చాలా రోజుల నుంచి తమను నాటో కూటమిలోకి తీసుకోవాలని ఉక్రెయిన్ చెబుతూ వస్తోంది. అయితే.. ఆయుధ, ఆర్థికపరంగా ఆ దేశానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న అమెరికా, దాని మిత్రదేశాలు సభ్యత్వం దగ్గరకు వచ్చేసరికి ఆచితూచి స్పందిస్తున్నాయి. ‘‘నాటో సభ్యత్వానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదు’’ అంటూ శనివారం బైడెన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అమెరికాయే కాదు.. జర్మనీ కూడా ఇందుకు అనుకూలంగా లేదు. కూటమిలోకి ఉక్రెయిన్ను చేర్చుకుంటే.. రష్యా మరింత రెచ్చిపోతుందని భయపడుతున్నారు. ‘‘ఆయుధపరంగా ఎంతైనా సాయం చేస్తాం. కానీ మూడో ప్రపంచయుద్ధాన్ని మేం కోరుకోవడం లేదు’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలివాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఈ భయాలను బలపరుస్తున్నాయి.
ఎందుకు ఆలస్యం?
ఉక్రెయిన్ను త్వరగా నాటో కూటమిలోకి చేర్చుకోవాలంటున్న దేశాలూ ఉన్నాయి. ఇటీవల జెలెన్స్కీ.. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను కలిశారు. ఆ సందర్భంగా ‘‘నాటో సభ్యత్వానికి ఉక్రెయిన్ అర్హురాలు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని ఎర్దొవాన్ స్పష్టంగా ప్రకటించారు. 32వ దేశంగా కూటమిలోకి స్వీడన్ చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎర్డోగాన్.. ఉక్రెయిన్ విషయంలో సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఫ్రాన్స్ కూడా దీనిపై రాజకీయ నిర్ణయం వెలువరించాల్సిన అవసరం ఉందని అంటోంది. సభ్యత్వమిస్తే రష్యా రెచ్చిపోతుందన్నది అనవసర ఆందోళన మాత్రమేనని చెబుతున్నాయి. ఇటీవల ఫిన్లాండ్ను కూటమిలోకి చేర్చుకున్నప్పుడు రష్యా పెద్దగా స్పందించని విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
చేర్చుకుంటామని చెప్పండి చాలు..
ఉక్రెయిన్ను ప్రస్తుతం కూటమిలోకి చేర్చుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ.. ఆ దేశానికి వర్తిస్తుంది అందులోని ఆర్టికల్ 5 ప్రకారం.. సభ్యదేశంపై ఎవరైనా దాడి చేస్తే.. కూటమిలోని దేశాలన్నీ తమపై దాడిగానే పరిగణిస్తాయి. కాబట్టి ఉక్రెయిన్ చేరిక పరిస్థితిని సంక్లిష్టంగా మారుస్తుందన్నది కొందరి వాదన. అయితే రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాతే తమను చేర్చుకోమని ఉక్రెయిన్ అంటోంది. అయితే చేరికపై రాజకీయ నిర్ణయం, మార్గసూచీ ప్రకటించాలని కోరుతుంది. ‘‘తక్షణం సభ్యత్వమివ్వాలని కోరడం లేదు. చేరికపై స్పష్టమైన సంకేతం ఇమ్మంటున్నాం. యుద్ధం ముగిసిన తర్వాతే చేర్చుకోండి’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. ఈ నేపథ్యంలో లిథువేనియాలోని ఈ వ్యవహారం నాటోకు అగ్నిపరీక్షే.