విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 10: ముదపాక ల్యాండ్ పూలింగ్‌లో దళారీ జలవిహార్ రామరాజుకు మేలు చేయడం కోసం దాదాపు 38 ఎకరాల భూమిలో బినామీ పేర్లను రెవెన్యూ అధికారులు చేర్చేశారు. భూములు లేని 25 మంది పేర్లతో 38 ఎకరాల భూమిని సృష్టించారు. ఈ బినామీ లందరూ వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులే కావడం విశేషం. పెందుర్తి శాసన సభ్యుడు అదీప్‌రాజ్ కనుసన్ననలోనే ఈ వ్యవహారం నడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ జీవోని అనుసరించి సర్వే నెంబరు 38లో కూడా ల్యాండ్ పూలింగ్ జరగాల్సి వుంది. ఈ నేపథ్యంలో దళారీ జలవిహార్ రామరాజు సర్వే నెంబరు 38లో వున్న కొంతమంది రైతులతో అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అయితే ఏ కారణమో తెలియదుగాని సర్వే నెంబరు 38లో ల్యాండ్ పూలింగ్ను రెవెన్యూ అధికారులు నిలిపి వేశారు. దీంతో తాను ముందుగా అగ్రిమెంట్లు చేయించుకున్న రైతుల్నే సర్వే నెంబరు 75, 76లో బినామీలుగా చూపించేశారు.
అసలు రైతులకు సర్టిఫికెట్లను (ఎల్పీవోసీ) ల్యాండ్ పూలింగ్ ఓనర్ ఇవ్వలేదు గాని ఈ బినామీల పేర్ల మీద ఎల్పీవోసీలు సిద్ధమై పోయాయి. ఉప్పిలి కనకరాజు, పెందుర్తి మండల వైసీపీ జెడ్పీటీసీ భర్త. ఇతడికి సెంటు భూమి కూడా లేదు. అయినా జాబితాలో ఇతడికి మూడెకరాల భూమి ఉన్నట్టు చూపించి 1350 చదరపు గజాల స్థలం ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. కేవలం జలవిహార్ రామరాజుకు స్థలాన్ని ఇప్పించడం కోసమే రెవెన్యూ అధికారులు అడ్డదారులు తొక్కారు. అలాగే ఉప్పిలి సన్యాసిరావుకు కూడా రెండు సర్వే నెంబర్లలో దాదాపు 66 సెంట్ల భూమి ఉన్నట్టు చూపించి 297 గజాలు ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. ఈ విధంగా వైసీపీకి చెందిన 25 మంది బినామీలు ల్యాండ్ పూలింగ్‌లోకి దూరిపోయారు. అలాగే ఒక చోట భూమి వుంటే రెండు చోట్ల తన భూమి పోయిందని రాయించుకున్న వ్యక్తులూ వున్నారు. గొరపల్లి గోవిందకు రెండు చోట్ల భూమి పోయిందని చూపించారు. దీని ద్వారా 540 గజాలకు, 508.5 గజాలకు కూడా ఎల్పీఓసీలు ఇచ్చేశారు. జలవిహార్ రామరాజుకు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న సియాద్రి రమణకు జాబిత ప్రకారం 1.21 ఎకరాల భూమి వుంటే 2 ఎకరాలు వున్నట్టు చూపించారు. వైసీపీకి చెందిన సర్పంచ్ అల్లుడు సారిపల్లి గణేష్ కూడా రెండు చోట్ల భూములు పోగొట్టుకున్నట్టు రికార్డు సృష్టించారు. దీని ద్వారా ఒక చోటకు 900 చ॥ గ॥ రెండో చోటకు 522 చ॥గ॥లకు ఎల్పీవోసీలు రాయించుకున్నారు. ఇన్ని అక్రమాలతో కూడిన జాబితాను తక్షణం రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దళారీ జలవిహార్ రామరాజుకు లబ్ది చేకూరడం కోసం ఎమ్మెల్యే అదీప్‌రాజుతో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున కూడా నిర్విరామంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వున్నాయి.