సులభంగా డబ్బు సంపాదించవచ్చనే అత్యాశకు పోతే అసలుకే మోసం ఎదురైంది. రూ.500 నోట్లు తీసుకుని రూ.2 వేల నోట్లు ఇస్తామని నమ్మబలికి చిత్తుకాగితాలు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు పరారైన ఘటన పెద్దాపురం పట్టణంలో సంచలనం రేపింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు పట్టణంలో పానీపూరీ విక్రయిస్తుంటారు. వీరికి బిహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులతో కరెన్సీ నోట్ల మార్పిడి విషయంలో ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా రూ.2 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు, రూ.4 లక్షల విలువైన రూ.500 నోట్లు మొత్తంగా రూ.6 లక్షల నగదు ఇస్తే బదులుగా రూ.18 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు చెల్లిస్తామని బిహార్‌కు చెందిన వ్యక్తులు నమ్మబలికారు. దీంతో ఆశపడిన పానీపూరీ విక్రేతలు ఒప్పందం ప్రకారం పెద్దాపురం పట్టణంలోని కబడ్డీవీధి ఫకీరు నుయ్యి ప్రాంతంలో వారు సూచించినట్లే రూ.6 లక్షలు నగదు అందించారు. బదులుగా రూ.18 లక్షలు ఇవ్వాల్సిన మోసగాళ్లు చిత్తు కాగితాలతో కూడిన సంచి ఇచ్చి ఇక్కడ తెరవవద్దని, ఇంటికి వెళ్లి చూసుకోవాలని చెప్పి ఉడాయించారు.
ఇంటికి వెళ్లిన తర్వాత పానీపూరి వ్యాపారులు సంచిని తెరిచి చూడగా కరెన్సీ నోట్లకు బదులు చిత్తు కాగితాలు కనిపించాయి. దీంతో తాము మోసపోయామని గ్రహించి పెద్దాపురం పోలీసులను ఆశ్రయించారు. చిత్తుకాగితాలు ఇచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని ఫిర్యాదులో వివరించారు. పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. దీనిపై పెద్దాపురం సీఐ షేక్ అబ్దుల్నబీని వివరణ కోరగా పానీపూరీ వ్యాపారుల నుంచి ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని వివరించారు.