అమరావతి, న్యూస్లీడర్, జూలై 11 : రాజధాని ఏర్పాటుకు సంబంధించిన కేసులను విడదీసి ఆర్5 జోన్ పిటిషన్లపైనే విచారించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్5 జోన్ అంశంపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులకు సంబంధించిన విచారణను త్రిసభ్య ధర్మాసనానికి హైకోర్టు అప్పగించింది. అనంతరం విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
ఆర్-5 జోన్లో పట్టాల పంపిణీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీన త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల ఐదో తేదీన ఆర్-5 జోన్ల పిటిషన్లపై విచారణ సమయంలో.. సుప్రీంకోర్టు పట్టాల పంపిణీకి మాత్రమే అనుమతించిందా? లేదా ఇళ్ల నిర్మాణానికీ అనుమతి ఇచ్చిందా? స్పష్టత ఇస్తూ వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ.. వారం రోజుల గడువు ఇచ్చింది.
ఈ వ్యాజ్యాల్లో వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి నోటీసులు జారీ అయ్యాయి. ఆమెతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ డిప్యూటీ కార్యదర్శి, ఏపీ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, రెవెన్యూ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియల్ అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ కమిషనర్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్, ల్యాండ్ కేటాయింపు కమిటీ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు, సంబంధిత తహశీల్దార్లకు నోటీసులు ఇస్తూ- హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు, జస్టిస్ వి.జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాలపై రైతుల తరఫున ఈ కేసు వాదిస్తోన్న సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు అభ్యంతరం తెలిపారు. రాజధాని కేసులతో ముడిపెట్టకుండా కేవలం ఆర్-5 జోన్ పిటిషన్లపై ప్రత్యేకంగా విచారణ చేయాలని కోరారు. అందుకు న్యాయమూర్తులు సమ్మతిస్తూ- వచ్చే సోమవారం త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్లు ఉంచాలంటూ రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు.