పోలీసులకు 19మంది బాధితుల ఫిర్యాదు
జార్ఖండ్ వాసి రాహుల్ సింగ్ కోసం బాధితుల గాలింపు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 11: విశాఖలో మరో వైట్ కాలర్ మోసం బయటపడిరది. సూటూ బూటూ వేసుకుని, కార్లలో తిరగుతూ, తనది చాలా పెద్ద కుటుంబమంటూ బిగ్షాట్లతో పరిచయం పెంచుకుని ఆనక జనం సొమ్ముతో పరారైపోయిన ఓ వ్యక్తి వైనం వెలుగులోకి వచ్చింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలొస్తాయంటూ సదరు వ్యక్తి ఏకంగా రూ.4కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టేసి బిచాణా ఎత్తేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తమకు న్యాయం చేయాలంటూ 19మంది బాధితులు సోమవారం రాత్రి ఎంవీపీ పోలీసుల్ని ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని సత్యం జంక్షన్లో ‘ఈక్విటీ నాక్స్’ పేరిట జార్ఖండ్‌కు చెందిన రాహుల్ సింగ్ (45) అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ కార్యాలయాన్ని తెరిచాడు. షేర్ల కొనుగోలు/విక్రయాల ద్వారా తాను సంపాదిస్తున్నానని అందర్నీ నమ్మించాడు. అంతేనా విశాఖలోని ప్రముఖ వ్యాపారులంతా గ్రూపుగా ఉన్న ‘బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) పెద్దల్ని పరిచయం చేసుకున్నాడు. తనతో వ్యాపారం చేస్తే నెలనెలా పెట్టుబడి కంటే అధికమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ప్రకటించుకున్నాడు.
ఏడాది పాటు బానే ఉన్నా..
ఆయన్ను నమ్మిన వారంతా రూ.30వేలు, రూ.50వేలు చొప్పున మదుపుగా ఇచ్చారు. అధిక లాభాలొస్తే నిర్ణీత మొత్తమే ఇస్తానని, నష్టం వస్తే మాత్రం ఇబ్బంది లేకుండా తానే పూడ్చేస్తానని రాహుల్ సింగ్ చెప్పుకొచ్చేవాడు. ఇలా ఏడాది పాటు లాభాలు చూపిస్తూ రావడంతో చాలా మందే ఆయనకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. తన తండ్రి, బావ, తానూ నేవీలో ఉద్యోగం చేరి రిటైరయ్యామని, తన భార్య తరఫువారంతా జార్ఖండ్‌లో అధికార పార్టీ నేతలేనని, తాను నగరంలోని ప్రముఖ విద్యా సంస్థలో గెస్ట్ లెక్చరర్‌గా పని చేస్తున్నానంటూ రాహుల్ చెప్పేవాడు. కానీ గత రెండు నెలలుగా ఫోన్ సరిగా ఎత్తకపోవడం, క్లాసులకెళ్లాలని చెబుతుండడం, ఆయన కార్యాలయ సిబ్బంది కూడా సరిగా సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు ఆరా తీయగా, కుటుంబ సభ్యులతో కలిసి పరారైపోయాడని తేలింది. బిర్లా జంక్షన్లో ఉంటున్న ఆయనింటికి వెళ్లి చూసినా ఫలితం లేకపోవడంతో 19మంది బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు.
ముంబయిలోనూ పరిచయాలు
తాను ముంబయిలోని ఛాయిస్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టానని రాహుల్ చెబుతూ వచ్చాడు. గత నెల 16న తాను కోల్‌కతా వెళ్లి వస్తానంటూ చెప్పి మరి రాలేదు. దీంతో పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో ఫిర్యాదు చేయగా, క్రైం డీసీపీ నాగన్న ఆరా తీశారు. కేసు పరిశీలించాల్సిందిగా ఎంవీపీ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇప్పటి వరకూ నాలుగు కోట్ల మేర రాహుల్ పట్టుకుపోయాడని తేలిందని, బాధితులు ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.