. రాష్ట్రంలోని 74 వేల స్థానాలకు ఈ నెల 8న ఎన్నికలు
. మెజారిటీ స్థానాల్లో అధికార టీఎంసీ ముందంజ
. ఇప్పటి వరకు ఒక్క స్థానంలోనూ ఆధిక్యం చూపలేకపోయిన బీజేపీ, కాంగ్రెస్
కోల్కత్తా, న్యూస్ లీడర్, జులై 11 పలు హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ టీఎంసీ తన ఆధిక్యతను చాటుకుంటోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 136 పంచాయతీ సమితిల్లో అధికార తృణమూల్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి ఫలితాల సరళిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం పంచాయతీ, జిల్లా పరిషత్ సీట్లలో ముందంజలో ఉంది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఇప్పటి వరకు ఒక్క స్థానంలోనూ ఆధిక్యం కనబర్చలేదు. కాగా, ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. మరోవైపు, ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పౌల్ మాట్లాడుతూ హత్యలు, ఘర్షణల మధ్య జరిగిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఈ ఎన్నికల్లో తాము ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగినట్టు చెప్పారు. ఈ నెల 8న రాష్ట్రంలోని 74 వేల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 80.71 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగుకు ముందు, పోలింగ్ రోజున చాలా చోట్ల హింస చెలరేగింది. కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులను తగలబెట్టారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో ఇప్పటి వరకూ 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల్లో హింస నేపథ్యంలో లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2018లో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శ ాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది.
కౌంటింగ్ కేంద్రం వద్ద పేలుడు.. బెంగాల్లో మళ్లీ ఉద్రిక్తత
పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ డైమండ్ హార్బర్లోని ఓ పోలింగ్ కేంద్రంపైకి దుండగులు బాంబులు విసిరారు. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు. హావ్డాలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని స్థానికులు ముట్టడిరచారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.