దుబ్బాక, న్యూస్లీడర్, జూలై 12 : సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చాపేటలో మైనర్ ప్రేమ జంట బుధవారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దుబ్బాకకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక, లచ్చాపేటలో పదో వార్డుకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలుడు దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం బాలుడి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఒకే తాడుతో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గుర్తించిన బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుబ్బాక ప్రాంతీయాసుస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఓ లేఖ లభ్యమైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.