ఆకస్మిక తనిఖీల పేరుతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఓ ఉన్నతాధికారి వసతిగృహ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్లోని ఝాబువా జిల్లాలో జరిగింది. డిప్యూటీ కలెక్టర్ సునీల్ యాదవ్ ఝా (56) ఆదివారం గిరిజన బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
ప్రిన్సిపల్ను బయటే ఉండమని బాలికలను గది లోపలికి తీసుకువెళ్లారు. ముందుగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి ప్రశ్నలు అడిగారు. తర్వాత బాలికల మంచంపైన కూర్చొని వారిపై చేతులు వేయడం, కౌగిలించుకోవడం వంటివి చేశారు. ఇంకా బాలికలు ఇబ్బందిపడేలా ప్రశ్నలు వేశారని పోలీసులు తెలిపారు. 11 నుంచి 13 ఏళ్ల వయసున్న విద్యార్థినులతో ఉన్నతాధికారి ప్రవర్తించిన తీరుపై అధ్యాపకుల ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు సునీల్ యాదవ్ ఝాను పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరచి, జుడిషియల్ కస్టడీకి తరలించారు.