చెన్నై, న్యూస్లీడర్, జూలై 12 : ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువకులను మోసగించి డబ్బు, నగలు దోచుకొని పరారవుతున్న యువతిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. చెన్నైకి చెందిన ఓ యువతి సోషల్ మీడియా వేదికగా ఛీటింగ్కు పాల్పడుతున్నది. తొలుత.. సదరు యువతి సోషల్ మీడియాలో డబ్బున్న వారితో పరిచయం పెంచుకుంటుంది. ప్రేమ పేరుతో వల విసురుతుంది.. పెళ్లి సైతం చేసుకుని కాపురానికి వస్తుంది. ఆ పై అదను చూసి చూసుకుని ఇంట్లో దాచిన డబ్బూ, నగలతో పరారవుతున్నది. ఇలా పలు రాష్ట్రాలలో ఈ యువతి ఏకంగా ఎనిమిది మందిని మోసం చేసింది. తాజాగా ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ మాయలేడి కోసం చెన్నై పోలీసులు గాలిస్తున్నారు.
తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాలో రషీద అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే గడిచినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4న ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షలు, 5 సవర్ల బంగారు నగలతో రషీద పరారైంది. బాధితుడు మూర్తి ఫిర్యాదుతో దర్యాఫ్తు మొదలు పెట్టిన పోలీసులు షాకింగ్ వివరాలను బయటపెట్టారు.
నీలగిరి జిల్లా గూడలూర్కు చెందిన రషీద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డబ్బున్న మగవారిని పరిచయం చేసుకుంటుందని, వారితో నిత్యం ఛాటింగ్ చేస్తూ ప్రేమ పేరుతో దగ్గరవుతుందని పోలీసులు తేల్చారు. ఆపై పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాక ఇంట్లోని డబ్బు, నగలతో పారిపోతుందని తెలిపారు. ఇలా ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని మోసం చేసిందని పోలీసులు వెల్లడిరచారు.