ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వివిధ ప్రారంభోత్సవాలకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని అస్వస్థతకు గురయ్యారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి సోమవారం రాత్రి జగ్గయ్యపేటలోని తన సమీప బంధువు, స్థానిక ఎస్జీఎస్ కళాశాల ఏవో కె.సత్యనారాయణ రావు ఇంటికి వచ్చారు.
అనంతరం రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలలో నూతన భవనాలు, పలు విభాగాలను ప్రారంభించారు. ఆసుపత్రిలో రద్దీ కారణంగా పలుమార్లు ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తర్వాత నిర్వహించిన సభలో కూడా ముక్తసరిగా మాట్లాడి కూర్చుండిపోయారు. ఆమె పరిస్థితిని గమనించిన ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారిణి సుహాసిని ఆమెకు ఓఆర్ఎస్ ప్యాకెట్ అందించారు. కార్యక్రమం మధ్యలోనే మంత్రి వేదిక దిగి బంధువు ఇంటికి వెళ్లిపోయారు.
డాక్టర్ సౌజన్య, ప్రభుత్వ వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆమెకు సెలైన్ పెట్టి చికిత్స చేస్తున్నారు. అలసట, నీరసం కారణంగా అస్వస్థతకు గురైనట్లు పరీక్షలు చేసిన వైద్యులు చెప్పారని సన్నిహితులు తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఇతర నేతలు ఆమెను పరామర్శించారు.