భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మైలవరంలోని రామకృష్ణకాలనీలో చోటుచేసుకుంది. హతురాలి ఆడపడుచు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు…మైలవరానికి చెందిన పెనుముక్కల మధుమురళికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరకు చెందిన దుర్గాభవాని (21)తో ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు వర్షిత్, రెండేళ్ల కుమార్తె జెస్సీ ఉన్నారు. కొన్నేళ్లుగా జి.కొండూరు మండలం కుంటముక్కలలో మధుమురళి తన తల్లి, సోదరి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అక్కడే గేదెలు మేపుతూ పాల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు.
గత నెల 22న మధుమురళి మైలవరంలోని రామకృష్ణ కాలనీలోని ఆంజనేయ గుడి సమీపంలో కొత్త ఇల్లు అద్దెకు తీసుకొని దిగారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో దుస్తులు మడతపెడుతున్న భార్యతో గొడవకు దిగిన మధుమురళి ఒక్కసారిగా కత్తి తీసుకొని మెడపై ఇష్టానుసారంగా పొడిచాడు. ఇంట్లోనే ఉన్న అతడి సోదరి వాణి అడ్డుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. తీవ్ర గాయాలతో దుర్గాభవాని అరుచుకుంటూ బయటకు పరుగెత్తి కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న సీఐ మోహనరెడ్డి, ఎస్సై హరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత ఏసీపీ ఎం.రమేష్ ఘటనా స్థలికి చేరుకొని హత్య జరిగిన వైనాన్ని నిందితుడి సోదరి నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
భార్యపై అనుమానంతో గొడవపడుతుంటే సర్దిచెప్పామని, ఇంతలోనే అకస్మాత్తుగా కత్తి తీసుకొని పొడిచి చంపాడని నిందితుడి సోదరి వాణి పోలీసులకు తెలిపింది. వదినతో కలిసి ఉదయమే సరదాగా చరవాణిలో ఫొటో దిగానని, సాయంత్రానికి విగతజీవిగా మారిందని కన్నీటిపర్యంతమైంది. బాలికల వసతిగృహంలో పని కుదిరేందుకు మాట్లాడానని తన వదిన చెపుతుండగా అన్న ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ చిన్న పిల్లలను భుజాన వేసుకుని బోరున విలపించింది.
‘‘మేమంతా వరండాలో ఆడుకుంటున్నాం.. ఇంతలో అమ్మ ఇంట్లో నుంచి కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పడిపోయింది. ఎంత పిలిచినా పలకలేదు. నాన్నే అమ్మను కత్తితో పొడిచాడు’’ అని నాలుగేళ్ల చిన్నారి చెబుతుంటే.. చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు.