ఇందౌర్, న్యూస్‌లీడర్, జూలై 12 : స్ట్రీట్‌ఫుడ్ పానీపూరీకి ఉండే క్రేజీ అంతా ఇంతా కాదు. చిన్నాపెద్దా తారతమ్య భేదాలు లేకుండా అన్ని వయసుల వారు పానీపూరిని ఎంచక్కా ఆస్వాదిస్తారు. ప్రతి సాయంత్రం పూట పానీపూరి తినకుండా ఉండలేని వారు చాలా మంది ఉంటారంటే అతిశయోక్తి కాదేమో. ఏ కాలంలో అయినా పానీపూరీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గదు. ఈ స్ట్రీట్‌ఫుడ్‌కు ఇప్పుడు విశేష ఖ్యాతి లభించింది. పానీపూరిపై ప్రపంచ రికార్డు నెలకొల్పి 8 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రముఖ సెర్జ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. దీంతో పాటు పానీపూరీ ఆకృతులతో ఓ ఇంటరాక్టివ్ గేమ్‌ను తీసుకొచ్చింది. నెటిజన్లను ఈ గేమ్ తెగ ఆకట్టుకుంటోంది.
ఈ రోజు పానీపూరీ ప్రత్యేకత ఏమిటంటే..
2015, జులై 12న మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఒక రెస్టారెంట్ 51 రకాల రుచికరమైన పానీపూరీలను అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విశేషాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు గూగుల్ 8 ఏళ్ల తర్వాత ఈ రికార్డును గుర్తుచేస్తూ పానీపూరీ డూడుల్‌ను తీసుకువచ్చింది. వివిధ భిన్న సంస్కృతులు, ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్న మనదేశంలో దీనిని రకరకాల పేర్లతో పిలుస్తారు.