విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 12: జీవీఎంసీ లీలలు గ‘మ్మత్తు’గా ఉంటున్నాయి. సామాన్యులు కాళ్లరిగేలా తిరుగుతున్నా సకాలంలో అనుమతులు మంజూరు చేయని టౌన్‌ప్లానింగ్ విభాగం.. బిల్డర్లు, రియల్టర్లు దరఖాస్తు చేసుకుంటే మాత్రం గంటల వ్యవధిలో ఇచ్చేస్తుంది. మరో విచిత్రం ఏమిటంటే అక్కడ తప్పు జరుగుతోంది. పరిశీలించండంటూ స్థానికులు ఫిర్యాదిచ్చినా 480 గజాల్లో (రెండు ప్లాట్లలో) భవన నిర్మాణాలకు జీవీఎంసీ అనుమతులిచ్చేయడం ఆలస్యంగా వెలుగు చూసింది. చినగదిలిలో టౌన్ సర్వే నంబర్ 111/1లో ప్లాట్ నంబర్ 41, 42, 43లలో పిట్టల భూషణం భాయి, దుష్యంతరావు, ఉదయ భాస్కర్ అనే వారికి అప్పట్లో ప్రభుత్వం డీ పట్టాల్ని మంజూరు చేసింది. తమకు పట్టా భూములున్నా జీవించేందుకు ఇబ్బందులు తప్పకపోవడంతో వారు బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఇదే అదనుగా శివకుమార్ అనే వ్యక్తి తప్పుడు సర్వే నంబర్లు, ధ్రువీకరణ పత్రాలు సృష్టించేసి సదరు స్థలంలో నిర్మాణాలకు అనుమతి కోరారు. అడిగిందే తడవుగా అనుమతులు కూడా మంజూరైపోయి, నిర్మాణ పనులు కూడా ప్రారంభమైపోతున్నాయి.
పన్ను రశీదు ఆధారంగా..
తమ హక్కులో లేని స్థలానికి ఎవరైనా పన్ను చెల్లిస్తున్నారంటే జీవీఎంసీకి అనుమానం రావాలి. కానీ వీఎల్టీ కింద కొన్నాళ్లు పన్ను చెల్లించేస్తే ఆ స్థలానికి యజమాని అయిపోయినట్టే అన్న ఒకే ఒక్క లాజిక్‌తో అక్రమార్కులు హౌస్ ట్యాక్స్, సబ్ డివిజన్ మార్చేసి, నకిలీ సర్వే నంబర్లు, 30 అడుగుల రోడ్డు లేకపోయినా ఉన్నట్టు చూపించేసి డీ పట్టాదారుల స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు కోరారు. ఇవేమీ పరిశీలించకుండానే జీవీఎంసీ అనుమతులిచ్చేసిందంటే అధికారులు ఎంతగా కళ్లు మూసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓల్డ్ డెయిరీ ఫారం దరి ఇందిరా గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో అప్పట్లో ప్రభుత్వం చాలామంది దళితులకు డీపట్టాలందజేసింది. ఆయా ప్రాంతాల్లో యథేశ్చగా అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. సర్వే నంబర్ 111/లో జరుగుతున్న అన్యాయంపై నగరానికి చెందిన ఎం.కిశోర్ అనే న్యాయవాది గత జనవరి 19న కలెక్టర్‌కు సైతం ఫిర్యాదిచ్చినట్టు చెబుతున్నారు. అదే విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయం నుంచి జీవీఎంసీకి కూడా లేఖ వచ్చింది. ఈ కేసును పూర్తి స్థాయిలో పరిశీలించాలంటూ కోరింది. బాధితులు తమ స్థలంలో రేకుల షెడ్లు కూడా నిర్మించుకున్నారు. అధికారులు అందుకు డోర్ నంబర్ కూడా కేటాయించారు. ఇదిలా ఉంటే 1993లో వుడా 34/39 పేరిట లే అవుట్ కూడా వేసింది. ఇన్ని ఆధారాలున్నా అక్రమార్కులు అనుమతులు కోరడం, జీవీఎంసీ ప్లాన్ కోసం మంజూరు చేసేశారంటే అధికారులెంతగా నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఊహించుకోవచ్చు.
అక్రమ కట్టడాలకు అడ్డా జోన్ 2
అక్రమ కట్టడాలకు జీవీఎంసీ జోన్2 అడ్డాగా మారిపోయింది. భవన నిర్మాణాల కోసం ఎవరైనా దరఖాస్తు చేయడం ఆలస్యం, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఆ స్థలం ఎవరిదో, ఎలా వచ్చిందో, ఎన్ని అడుగుల రోడ్డు ఉందో కూడా చూడకుండా, ఎన్ని గజాలు, ఎన్ని అంతస్తులు కట్టుకుంటావంటూ దరఖాస్తుదారుతో బేరాలాడేస్తున్నారు. బేరం కుదిరితే సదరు స్థలాలకు యాజమాన్యపు హక్కులు లేకపోయినా ప్లాన్లు మంజూరు చేస్తున్నారు. యాజమాన్య హక్కులు లేకపోతే ప్లాను కోసం ఏ విధంగా దరఖాస్తు చేయాలో, ప్లాన్ ఎలా మంజూరు చేస్తారో చెబుతూ అక్కడా బేరం సాగిస్తున్నారు. అందుకు అడ్వాన్సుగా కొంత మొత్తాన్ని తీసుకుని నేరుగా ప్లాన్ కోసం అప్లయ్ చేస్తే ప్లాన్ రాదని, లైసెన్స్డ్ పర్సన్‌తో ఆన్లైన్లో దరఖాస్తు చేయించి అంతా మేమే చూసుకుంటామంటూ సిబ్బంది అభయమిస్తున్నారు. అయితే వచ్చిన దరఖాస్తుల్లో కూడా చాలా వాటిని అధికారులు కనీసం పరిశీలించడం లేదు. తద్వారా సిబ్బంది కూడా సుమోటోగా ప్లాన్ రావడానికి సహకరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇందుకు ఉదాహరణే చినగదిలిలో జరుగుతున్న భవన నిర్మాణ పనులంటున్నారు ఆ ప్రాంత వాసులు. డీ పట్టాదారుల తరఫున సాక్షాత్తూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదులకే జీవీఎంసీలో దిక్కులేదంటే సామాన్య వర్గాల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా న్యాయవాది కిషోర్ ఇచ్చిన ఫిర్యాదును పెండింగ్‌లో ఉండగానే ప్లాన్లు ఎలా మంజూరు చేశారో అధికారులే చెప్పాల్సి ఉంది. ఇంత జరుగుతున్నా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి గానీ, జోన్ 2 సిబ్బంది నుంచి గానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదు.