బిహార్‌లోని గయ జిల్లా డోభీ పోలీస్‌స్టేషను పరిధి బజౌరా గ్రామంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వివాహితుడైన ఓ వ్యక్తి ఆ విషయం దాచిపెట్టి ఈ గ్రామ యువతిని రెండోపెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తనకు బట్టతల ఉందన్న విషయాన్ని కూడా దాచి.. విగ్గు ధరించి పెళ్లిమండపానికి వచ్చాడు.
కొద్దిసేపట్లో పెళ్లి అవుతుందనగా వధువు బంధువులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా.. అతడికి ఇది రెండోపెళ్లని, విగ్గు ధరించి వివాహానికి వచ్చాడని తెలిసిపోయింది. ఆగ్రహించిన వధువు బంధువులు ‘పెళ్లికొడుకు’ను చితకబాదారు. తాను చేసింది తప్పేనని, వదిలేయాలంటూ నిందితుడు ప్రాధేయపడ్డాడు. ఇంతలో విషయం తెలుసుకున్న అతడి భార్య సైతం ఘటనా స్థలానికి వచ్చింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించారు.