కోల్కతా, న్యూస్లీడర్, జూలై 3 : పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. టీఎంసీ భారీ విజయం దిశగా పరుగులు తీస్తోంది. మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 63 వేల పంచాయతీల్లో టీఎంసీ ఏకంగా 34,560 పంచాయతీ స్థానాల్లో విజయం సాధించింది. మరో 705 చోట్ల ఆధిక్యం వైపు దూసుకెళుతోంది. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ 9,621 స్థానాల్లో గెలిచింది. మరో 169 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక సీపీఎం 2,908 చోట్ల గెలిచి, 86 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2,515 స్థానాలను దక్కించుకుని, 71 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్లో మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమలులో ఉంది. మొత్తం 73,887 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 63,229 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మిగిలిన వాటిలో 9,730 పంచాయతీ సమితులు, 928 జిల్లా పరిషత్తు సీట్లు ఉన్నాయి. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు కొనసాగేటట్లు ఉందని అధికారులు తెలిపారు.
పంచాయతీ సమితులు..
పంచాయతీ సమితుల్లో టీఎంసీ ఇప్పటికే 6,228 స్థానాలను దక్కించుకింది. మరో 218 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 960 సమితుల్లో గెలిచింది. మరో 50 చోట్ల ముందంజలో కొనసాగుతోంది.
మొత్తం 928 జిల్లా పరిషత్తు సీట్లలో తృణమూల్ 592 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 188 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ కేవలం 18 స్థానాల్లో గెలుపొందగా, మరో 9 చోట్ల ముందంజలో ఉంది.
మరో ముగ్గురి మృతి..
కౌంటింగ్ సమయంలోనూ బెంగాల్లో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించగా.. ఓ పోలీసు అధికారి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని చోట్ల జరిగిన ఘర్షణల్లో కొందరు గాయపడ్డారు.