ఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 12 దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 రైళ్లను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ.. మరో 4 రైళ్లు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జులై నెలాఖరులోనే వీటిని ప్రారంభించాలని చూస్తోంది. ఈ నాలుగు రైళ్లూ ఎనిమిదేసి కోచ్‌లతో నడవనున్నాయి. ఇందులో ఏడు ఛైర్ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. అయితే ఈ నాలిగింట్లో తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించలేదు. మరో వందే భారత్ రైలు అందుబాటులోకి తెలుగు రాష్ఠ్రాలకు వస్తుందని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. చెన్నై- తిరుపతి లేదా చెన్నై- విజయవాడ మధ్య ఈ రైలు ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, ప్రస్తుతానికి దక్షిణాదిలో చెన్నై- తిరునల్వేలి మధ్య ఈ నెలలోనే వందే భారత్‌ను తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఈ రైలును వాయిదా వేసుకున్నట్టుగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ ఎప్పుడనేది చూడాలి.
ఆ నాలుగూ ఇవే…
ఈ నెలలో ప్రారంభించనున్న రూట్లలో దిల్లీ- చండీగఢ్, చెన్నై- తిరునల్వేలి, లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్- భోపాల్ ఉండనున్నాయి. ఎనిమిదేసి కోచ్‌లు అంటే 556 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం 25 రైళ్లు నడుస్తుండగా.. అందులో తొమ్మిది రైళ్లు ఎనిమిదేసి కోచ్‌లతోనే నడుస్తున్నాయి. కొత్త రైళ్లు కలిపితే మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 29కి చేరనుంది. ఢిల్లీ,- చండీగఢ్ రూట్లో ఇప్పటికే శతాబ్ది సహా పలు రైళ్లు నడుస్తున్నాయి. అయినప్పటికీ ఈ రూట్లో ప్రయాణికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో వందే భారత్ రైలును తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్ వందే భారత్ రూట్లో కొత్త రైలు తేవడం ద్వారా యూపీలో ఈ రైళ్ల సంఖ్య మూడుకు చేరనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్- భోపాల్ మధ్య వందే భారత్ రైలును తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆ రూట్లలో ఫేర్ కట్
వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నా కొన్ని రూట్లలో వాటికి ఆశించినంత డిమాండ్ ఉండడం లేదు. దీంతో కెపాసిటీ పెంచుకునేందుకు టికెట్ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కేవలం వందే భారత్ రైళ్లు మాత్రమే కాకుండా ఛైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ తరగతులు కలిగిన అన్ని రైళ్లలో 25 శాతం వరకు టికెట్ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్ ధరలపై నిర్ణయం జోనల్ స్థాయి అధికారులకు రైల్వే బోర్డు అప్పగించింది. మరోవైపు ప్రస్తుతం నీలం రంగులో ఉన్న వందే భారత్ రైళ్లనే నడుపుతున్నారు. త్వరలో కాషాయం రంగులో ఉన్న వందే భారత్ రైళ్లు రానున్నాయి. ఇటీవల చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు.