సీజన్ మారింది. వర్షాకాలం ప్రారంభమైపోయింది. వర్షాలు ప్రారంభమైతే అన్నదాతలకు ఆనందమే కానీ సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతుంటుంది. వాతావరణంలో మార్పు, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వీటిలో డెంగ్యూ అతి ముఖ్యమైంది.
ఆరోగ్యపరంగా వర్షాకాలం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సీజన్. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ సమస్య, నీటి కాలుష్యం, దోమల బెడత, అపరిశుభ్రత వంటి కారణాలు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. తాగే నీరు, తినే ఆహారం రెండూ కలుషితంగా లేదా ఇన్ఫెక్షియస్గా ఉండవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం దాదాపు 80 శాతం వ్యాధులకు కారణం నీళ్లే. అందుకే వర్షాకాలం బహుపరాక్ అంటారు.
వర్షాకాలంలో సాధారణంగా డయేరియా, టైఫాయిడ్, మలేరియా, ఫ్లూ, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. ఇందులో అన్నింటికంటే ప్రమాదకరమైంది డెంగ్యూ. ఎందుకంటే డెంగ్యూ వ్యాధి సోకినప్పుుడ ఆ వ్యక్తి శరీరంలోని రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గిపోతుంటాయి. ఆరోగ్యకరమైన మనిషిలో ప్లేట్లెట్ కౌంట్స్ సాధారణంగా 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకూ ఉంటాయి. అదే మనిషికి డెంగ్యూ సోకితే ఈ ప్లేట్లెట్ కౌంట్ గంట గంటకూ పడిపోతూ 20 వేల దిగువకు చేరుకుంటాయి. ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరం. మనిషి ప్రాణాలు పోవచ్చు.
ఎడిఫెలిస్ జాతి దోమ కాటుతో డెంగ్యూ వ్యాధి ప్రబలుతుంది. అపరిశుభ్రత, నిల్వ నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ దోమలు అభివృద్ధి చెందుతుంటాయి. డెంగ్యూ సోకితే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా అంటే 102 దాటి ఉండవచ్చు. బాడీ పెయిన్స్, శరీరంపై రెడ్ ర్యాషెస్, కళ్లలో నొప్పి, తలనొప్పి, తీవ్రమైన అలసట, కాస్సేపు కూడా కూర్చోలేకపోవడం వంటివి ప్రధానంగా కన్పిస్తాయి.
ప్లేట్లెట్ కౌంట్ పెరిగే అద్భుతమైన చిట్కా
డెంగ్యూ లక్షణాలు కన్పించినప్పుడు నిర్లక్ష్యం తగదు. సాధ్యమైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ పరీక్షించుకోవాలి. ప్లేట్లెట్ కౌంట్ 20 వేలకు తగ్గకుండా చూసుకోవాలి. 20 వేలకు తగ్గితే మాత్రం ఆసుపత్రిలో చేరి ప్లేట్లెట్స్ ఎక్కించుకోవల్సి వస్తుంది. ప్లేట్లెట్ సంఖ్య పెంచుకునేందుకు అద్భుతమైన చిట్కా కూడా చాలాకాలంగా వాడుకలో ఉంది. అది బొప్పాయి ఆకుల రసం. బొప్పాయి ఆకుల రసంతో ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది. ఉదయం సాయంత్రం రోజుకు రెండుసార్లు 4-5 ఎంఎల్ బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది.
అందుకే డెంగ్యూ పరిస్థితి తలెత్తకుండా వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. రాత్రిళ్లు దోమల్లేకుండా చూసుకోవాలి. బట్టలు పూర్తిగా కప్పుకునేట్టు ఉంటే మంచిది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాగింగ్ తప్పనిసరిగా చేయాలి. నిద్రపోయేటప్పుడు దోమతెరలు వాడటం మంచిది.