నేడు చైనా ఒక విచిత్రమైన సంక్షోభ అంచున నిలబడిరదని, దీని ప్రభావంతో భవిష్యత్తులో చైనా తీవ్రమైన సామాజిక ఆర్థిక సమస్యలను ఎదుర్కోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘సిక్స్ పాకెట్ సిండ్రోమ్’ లేదా ‘చిన్న చక్రవర్తి (లిటిల్ ఎంపెరర్)’ సమస్యగా గుర్తించబడిన సమస్యతో చైనాలో చిన్నారులు స్థూలకాయ సమస్యలను ఎదుర్కొంటున్నారని తేలింది. చైనా ప్రభుత్వం తీసుకున్న ఒక జంటకు ఒకే సంతానమనే (సింగిల్ చైల్డ్ పాలసీ) నిర్ణయంతో తమ ఏకైక సంతానాన్ని ప్రేమగా పెంచుతూ ఫిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీమ్‌లు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కొవ్వుతో కూడిన ఆహారం, చక్కర నిండిన శీతల పానీయాలు, సాసులు లాంటి ఆహార పదార్థాలకు అలవాటు చేయడంతో పిల్లలు స్థూలకాయం పొందుతున్నట్లు గమనించారు. ఏకైక సంతానానికి సంపన్న కుటుంబాల తల్లితండ్రులు, ఇద్దరు తాతలు (తండ్రి నాన్న, తల్లి నాన్న), ఇద్దరు తాతమ్మలు (నాన్నమ్మ, అమ్మమ్మ) కలిసి ఆరుగురు పిల్లాడిని లాలిస్తూ గారాబం చేయడం, కోరిన ఆహారాన్ని ఇవ్వడంతో పిల్లల్లో అధిక బరువు సమస్యలు ఉత్పన్నం కావడాన్ని ‘‘సిక్స్ పాకెట్ సిండ్రోమ్’’గా పేర్కొంటున్నారు.
ముద్దు చేసి ముద్ద తినిపిస్తూ..
ఈ సిక్స్ పాకెట్ సిండ్రోమ్ సమస్య పట్టణ పిల్లల్లో అధికంగా గమనించారు. తల్లితండ్రులు మంచి సంపాదన పరులు కావడంతో ఏకైక సంతాన ఆహారం పట్ల అధికంగా డబ్బులు వెచ్చించడానికి సహితం వెనకాడటం లేదని తేలింది. 1982లో 7 శాతం పట్టణ బాలలు అధిక బరువు కలిగి ఉండగా, 1992లో 15 శాతం, 2002లో 23 శాతం నగర పిల్లలు స్థూలకాయులుగా మారారని శాస్త్ర అధ్యయనంలో తేలింది. నేడు చైనాలో దాదాపు 12 కోట్లకు పైగా జనులు అధిక బరువు సమస్యలను అనుభవిస్తున్నారని, అందులో సగం మంది చిన్న స్థూల చక్రవర్తులు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. చిన్నారుల్లో స్థూలకాయ సమస్యలతో పలు రకాల వ్యాధులు, మధుమేహ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. చైనాలో వచ్చిన ఆర్థిక సామాజిక మార్పులతో తల్లితండ్రులు తమ ఏకైక సంతానాన్ని గారాబం చేసి పెంచడం, ముద్దు చేసి ముద్దలు తినిపించడం, పలు రకాల స్థూలకాయ ప్రేరేపిత ఆహారం అందుబాటులో ఉంచడంతో సిక్స్ పాకెట్ సిండ్రోమ్‌కు దారులు తెరిచినట్లు అయ్యింది. చైనాలో 7 నుంచి 22 ఏండ్ల వయస్సుగల పట్టణ బాలల్లో 16 శాతం స్థూలకాయ సమస్యలతో భారంగా బతుకుతున్నట్లు తేలింది. ప్రతి ఏట స్థూలకాయులు 8 శాతం పెరుగుతున్నారని, రానున్న రోజుల్లో ఈ సమస్య చైనాకు పెద్ద సంక్షోభ కారణం కావచ్చని హెచ్చరిస్తూ, ‘‘బిహేవియరల్ టైం-బాంబు’’గా కూడా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
సెడెంటరీ లైఫ్ స్టైల్:
బాల్య దశలో స్థూలకాయ సమస్య ఉత్పన్నం అయితే సహజంగా ఎదిగిన తరువాత కూడా సమస్య కొనసాగడం గమనించారు. చైనాలో లావుగా ఉన్న పిల్లలను చూసి పెద్దలు మురిసిపోతూ ఐశ్వర్యానికి సూచనగా భావించే ఆచారం ఉండడం విశేషం. యుక్త వయస్సులో జీరో సైజ్‌ను ఇష్టపడడంతో అధిక బరువు కలిగిన బాలికలు బరువు తగ్గించుకోవడం కష్టం అవుతున్నది. చైనా పట్టణ వాసులు అధిక ఆదాయాలను కలిగి ఉండడం, పశ్చిమ దేశాల ఆహార పదార్థాలు సులభంగా లభించడం, నిశ్చలమైన జీవనశైలి(సెడెంటరీ లైఫ్‌స్టైల్), కార్లలో తిరగడం, ఆల్కహాన్ పానీయాల సేవనం, భౌతిక శారీరక వ్యాయామం లోపించడం లాంటి పలు కారణాలతో సిక్స్ పాకెట్ సిండ్రోమ్ బారిన పడడం సాధారణం అవుతున్నది.
నేడు చైనా ప్రజలు, ముఖ్యంగా తల్లితండ్రులు, నలుగురు తాతలు/తాతమ్మలు తమ ఇంట్లోని ఏకైక సంతానాన్ని విచక్షణతో స్థూలకాయానికి దూరంగా పెంచాలని కోరుకుందాం. నేడు భారత సంపన్న కుటుంబాల పిల్లలు, యువత కూడా సిక్స్ పాకెట్ సిండ్రోమ్‌కు దూరంగా, ఆరోగ్యకర వాతావరణంలో పెరగాలని, ఇండియా మరొక సిక్స్ పాకెట్ సిండ్రోమ్ కేంద్రంగా మారకూడదని కోరుకుందాం.