బెంగళూర్, న్యూస్‌లీడర్, జూలై 13 : చైనా లోన్‌యాప్ ఏజెంట్ల వేధింపులకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన తేజన్ (22) అనే ఇంజనీరింగ్ విద్యార్థి చైనా యాప్ ద్వారా కొంత మొత్తం రుణం తీసుకున్నాడు. అయితే సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో సదరు రుణ సంస్థ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయి. డబ్బులు తిరిగి చెల్లించకుంటే ప్రైవేటు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ ఏజెంట్లు బెదిరింపులకు దిగారు. రోజురోజుకూ వేధింపులు మితిమీరుతుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన తేజప్ బెంగళూరులోని తమ నివాసం ఉన్న జలహళ్లిలోని తమ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తేజస్ యలహంకలోని నిట్టె మీనాక్షి కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.‘స్లైస్ అండ్ కిస్’ అనే చైనా యాప్ నుంచి కొంత మొత్తం రుణం తీసుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. విషయం తెలిసిన తేజస్ తండ్రి గోపీనాథ్ ఆ డబ్బులను విడతల వారీగా చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చారు. తేజ ఆత్మహత్యకు పాల్పడిన మూడు రోజుల ముందు రుణ చెల్లింపునకు మరికొంత సమయం కావాలని ఏజెంట్లను గోపీనాథ్ అభ్యర్థించినా వారు ససేమిరా అన్నారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం యాప్ ఏజెంట్లు తేజస్‌కు పలుమార్లు ఫోన్లు చేశారు. దీంతో తేజస్ ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘తనకు మరో మార్గం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనను క్షమించాలని’ తేజస్ పేర్కొన్నట్టు ఆ లేఖలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.