వెస్టిండీస్ గడ్డపై టీమిండియా బోణి అదిరిపోయింది. వెస్టిండీస్ కాలమాన ప్రకారం అక్కడ బుధవారం రాత్రి ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజే భారత్ జట్టు సత్తాచాటింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 64.3 ఓవర్లలోనే 150 పరుగులకి కుప్పకూలిపోయింది. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (40 బ్యాటింగ్: 73 బంతుల్లో 6×4), రోహిత్ శర్మ (30 బ్యాటింగ్: 65 బంతుల్లో 3×4, 1×6) ఉన్నారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఆ జట్టులో అలిక్ (47: 99 బంతుల్లో 6×4, 1×6) మినహా ఎవరూ కనీసం 20 పరుగుల స్కోరుని కూడా దాటలేకపోయారు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డివిరచగా.. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. అలానే మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. చంద్రపాల్ (2), కెప్టెన్ బ్రాత్‌వైట్ (20), రోఫెర్ (2), బ్లాక్‌వుడ్ (14), జాషువా (2), హోల్డర్ (18), జోసెఫ్ (4) వరుసగా తక్కువ స్కోరుకే ఔటైపోయారు. దాంతో 64.3 ఓవర్లలోనే వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
చివరి సెషన్లో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత్ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్.. ఆడుతు పాడుతూ బ్యాటింగ్ చేశారు. మరీ ముఖ్యంగా.. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫస్ట్ టెస్టు ఆడుతున్నా.. ఎలాంటి తత్తరపాటుకి లోనవలేదు. చాలా నింపాదిగా విండీస్ బౌలర్లని ఎదుర్కొంటూ కనిపిస్తున్నాడు. యశస్వి ఓపెనర్‌గా రావడంతో శుభమన్ గిల్ నెం.3 స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది.