ఉత్తరాది భారీ వర్షాలతో విలవిల్లాడుతోంది. కొండలు, కోనలు దొర్లిపడుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి..లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వరద ముప్పు ఏర్పడింది. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు వరద ఉధృతితో అడ్డొచ్చినవి కొట్టుకు పోతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ చరియలు మీదపడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు.
వరద ధాటికి, కొండ చరియల్లో భారీగా వాహనాలు ధ్వంసమౌతున్నాయి. భారీ వర్షాలు ఇంకా కొనసాగనుండటంతో వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకృతి వైపరీత్యాలు అంటే మనం సముద్రాన్ని, నదులను వ్యర్థాలతో ముంచెత్తితే అది తిరిగి వస్తుందని, అడవులను తుడిచిపెడితే వరదలు వస్తాయని, కాలుష్యానికి కారణమైతే భూతాపం వస్తుందని ప్రకృతి మాత సున్నితంగా గుర్తుచేస్తుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఒక వంతెన పూర్తిగా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. కేరళ వరదల సమయంలో పాలక్కాడ్లో ఇలాంటి దృశ్యం కనిపించింది. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలు, నదులు, సముద్ర జీవులపై ప్లాస్టిక్ ప్రభావం గురించి కొన్నేళ్లుగా మనందరికీ తెలుసు. కానీ, ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి వాదిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు.