ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 13 : ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా వీలైనంత త్వరలో భారత్ మార్కెట్లోకి అడుగు పెట్టే ప్రయత్నాల్లో ఉంది. దేశంలో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి ప్రతిపాదనల కోసం భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు ప్రారంభించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఏటా ఐదు లక్షల విద్యుత్తు వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేసిన కార్లను ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు భారత్ నుంచే ఎగుమతి చేయాలని ఎలాన్ మస్క్ కంపెనీ ప్రణాళికలు చేస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు ఉటంకించినట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిరచాయి. ఇక భారత్లో ఈ విద్యుత్తు వాహనాల ప్రారంభ ధర రూ.20 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై టెస్లాగానీ, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు.
గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం మస్క్ మాట్లాడుతూ.. భారత్లో టెస్లా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని, త్వరలోనే దీనిపై ప్రకటన ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ భేటీ తర్వాతే భారత్ ప్రభుత్వంతో టెస్లా సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది.
అయితే, భారత మార్కెట్లోకి టెస్లా రంగప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. కాగా, భారత్లోకి దిగుమతి చేసుకునే విలాసవంతమైన కార్లపై ప్రభుత్వం భారీ ఎత్తున సుంకం విధిస్తోంది. ‘కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రెయిట్’ విలువ 40,000 డాలర్లు దాటిన కార్లపై 100 శాతం సుంకం వర్తిస్తోంది. టెస్లా మోడళ్లన్నీ ఇంచుమించు ఈ కేటగిరీలోకే వస్తున్నాయి. దీంతో పన్నులను తగ్గించాలని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వాన్ని కోరారు. తదుపరి విక్రయాల తీరును బట్టి స్థానికంగా తయారీపై ఆలోచిస్తామని తెలిపారు.
అయితే, దీనికి ప్రభుత్వం సమ్మతించలేదు. ఇతర వాహన తయారీ సంస్థల తరహాలోనే టెస్లాను సైతం పరిగణిస్తామని స్పష్టం చేసింది. భారత్లోనే తయారీని చేపట్టడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని.. అప్పుడు కార్లకు డిమాండ్ ఉంటుందని సూచించింది. కనీసం విడి భాగాలుగా తీసుకొచ్చి భారత్లో అసెంబుల్ చేసే విధానం పైనేనా దృష్టి సారించాలని టెస్లాకు భారత ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే గతంలో కొంతకాలం పాటు ఈ ప్రణాళికలను టెస్లా నిలిపివేయగా.. ఈ ఏడాది నుంచి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.