ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అందర్నీ కలుపుకు పోవాల్సింది పోయి ఒక్కొక్కర్ని దూరం చేసుకుంటుండంతో వైసీపీ క్యాడర్లో అయోమయం నెలకుంది. ఒక్కరుపోతే ఏమైపోతుందనే ధోరణిలో అగ్రనేతల వైఖరి ఉండడంతో సీనియర్లు కూడా చేజారిపోతున్నారు. ఇన్ఛార్జిగా వైైైవీ వచ్చిన తరువాత పటిష్టమవుతుందనుకుంటే పరిహాసంగా మారుతోందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 13: విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు రాజీనామా చర్చనీయాంశంగా మారింది. కేవలం విశాఖ, విజయనగరం జిల్లాల ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి వైఖరితో విసిగిపోయినందు వల్లే పంచకర్ల రమేష్ రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది నెలలుగా పంచకర్ల పార్టీ వ్యవహారాల్లో మౌనంగా ఉన్నారు. ఆయన మాట ఎక్కడా చెల్లడం లేదు. పేరుకు మాత్రమే పార్టీ అధ్యక్షుడు. కానీ వ్యవహారాలన్నీ సుబ్బారెడ్డే నడుపుతున్నారు. అలాగని కార్యకర్తలు, నాయకుల సమస్యల్ని తెలుసుకుంటున్నారా అంటే అదీ లేదు. విమానంలో వస్తారు. అంతకుముందు రోజు పార్టీ కార్యాలయం నంచి ప్రకటన వెలువడుతుంది. ‘సుబ్బారెడ్డి ఫలానా సమయంలో విశాఖ వస్తున్నారు, దయచేసి ఎవరూ శాలువాలు తేవద్దు’ అని. అయితే సీనియర్ నాయకులకు సయితం కలసి నాలుగు ముక్కలు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదన్నది ప్రధాన విమర్శ. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. కనీస సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడంతో కార్యకర్తలూ, నాయకులూ అసంతృప్తితోనే కొనసాగతున్నారు. పార్టీలో కష్టపడుతున్న వారెవరు? కబుర్లు చెప్పి పెత్తనం చెలాయిస్తున్న వారెవరు? అన్న బేరీజు చేసే పరిస్థితి పార్టీలో లేకుండా పోయింది. ఈ పరిస్థితి నుంచి పార్టీని బయట పడేయడానికి పంచకర్లకు ఉత్సహం ఉన్నా, పార్టీ మాత్రం స్వేచ్ఛ నివ్వలేదు.
ఆ మాటకొస్తే వైసీపీ పార్టీలోగాని, ప్రభుత్వంలోగాని పదవులు చేపట్టిన ఎవరికీ స్వేచ్ఛ లేదన్నది తొలి నుంచీ వినిపిస్తున్న వాదన. నిన్న గాక మొన్న విశాఖ రూరల్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని తప్పించారు. అక్కడ కూడా అదే సమస్య. వైసీపీలో ఎవరికి వారే నాయకులు. సుబ్బారెడ్డిని స్వయంగా కలుసుకొని తామే నాయకులమని ఫీలయిపోయేవారు సహజంగానే పార్టీ అధ్యక్షున్ని పట్టించుకోవడం లేదు. అందువల్ల సమస్యలున్న సామాన్య కార్యకర్తలు పార్టీ అధ్యక్షుల నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. అలాగని సుబ్బారెడ్డిని కలవ లేకపోతున్నారు. అందువల్ల పార్టీలో అసంతృప్తి వాదులు పెరిగిపోతూనే ఉన్నారు.
మాజీ ఎమ్మెలే దుస్థితి ఇలా…
పార్టీలోని మాజీ శాసన సభ్యుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. సీనియర్ మాజీ శాసనసభ్యుడు రెహామాన్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తి రెడ్డి వంటి సీనియర్ నాయకులకు ఏ మాత్రం ప్రాముఖ్యత లేకుండా పోయింది. వీరికి ప్రాముఖ్యత కలిగిన ఎటువంటి పదవుల్నీ ఇవ్వకుండా నాలుగేళ్ళ కాలక్షేపం చేసేశారు.
వైవీతోనే అసమ్మతులన్నీ…
వీళ్ళ మనోభావాలను తెలుసుకోవలసిన వైసీపీ నాయకత్వం ఇన్నాళ్ళు మౌనంగానే ఉండిపోయింది. ఇదిలావుంటే ఇటీవల వైవీ సుబ్బారెడ్డి వ్యవహారం పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి అదీప్‌ను గెలిపించాలని వైవీ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సీటును తొలుత పంచకర్లకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇక్కడ పని చేసుకోమని పంచకర్లకు చెప్పేశారు కూడా. అయితే ఇప్పుడు పంచకర్లను అనకాపల్లి పార్లమెంటుకు పంపించాలని ప్లాన్ చేశారు. అయితే అందుకు పంచకర్ల అంగీకరించలేదు. తనకు పేరు ప్రతిష్టలున్న పెందుర్తిలో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లనూ చేసుకున్న తరువాత ఇలా మాట మార్చడాన్ని పంచకర్త దిగమింగుకోలేనట్టుంది. పార్టీ అభ్యర్థి కోసం పని చేసేందుకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్న బాధలో ఉన్న పంచకర్ల చివరకు రాజీనామా చేసి బయట పడినట్టు తెలుస్తోంది. పంచకర్ల రాజీనామాను తేలిగ్గా తీసుకుంటే అది వైసీపీకి పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ పరిణామాన్ని కనువిప్పుగానే పరిగణిస్తే పార్టీకి మంచిదన్న అభిప్రాయం వైసీపీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ ఉంది.