బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన 43 ఏళ్ల మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ వంశీ అలియాస్ సాయి రిచర్డ్స్ అలియాస్ లోకేశ్ 10వ తరగతి చదువుతున్న సమయంలో ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్లి ఎల్బీ నగర్లో స్థిరపడ్డాడు. చెడు వ్యసనాలకు బానిసై 2008లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈక్రమంలో సైౖబారాబాద్ పోలీసులకు దొరికి జైలు శిక్ష అనుభవించాడు. బయటకు వచ్చినా ప్రవర్తన మార్చుకోలేదు. హైదరాబాద్, చుట్టుపక్కలా ప్రాంతాల్లో 77 పైగా దొంగతనాలు చేశాడు. తరువాత గుంటూరు, విజయవాడకు వచ్చి దొంగతనాలు చేసి, దోచుకున్న వస్తువులు ఇతరత్రా బస్టాండు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులకు అమ్మేవాడు.
కారు డ్రైవర్ ముసుగులో.. పోలీసుల నిఘా పెరగడంతో వారి దృష్టి మళ్లించడానికి కారు కొనుక్కొని బాడుగలకు తిప్పుతున్నాడు. ఈ నెల 5వ తేదీన విజయవాడ నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని గుంటూరులో దింపేసిన తర్వాత, కొత్తపేట వడ్డూరవారి వీధిలో వెళుతుండగా నరసింహారావు, ఆయన కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లటం చూశాడు. కారును కొంతదూరంలో ఆపేసి వచ్చి, ఆ ఇంటి తాళం విరగ్గొట్టి లోపలకు చొరబడి బంగారు ఆభరణాలు తస్కరించాడు. కిందికి వచ్చి తన కారు నంబర్ మార్చుకొని పారిపోయాడు. కొత్తపేట సీఐ అన్వర్‌బాషా కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో నేరవిభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు, తూర్పు ఏఎస్పీ నచికేట్ షల్కే, డీఎస్పీ ప్రకాష్‌బాబు, సీసీఎస్, ఐటీకోర్ బృందాలు చేపట్టిన దర్యాప్తులో పాత నేరస్థుడు వంశీకృష్ణగా గుర్తించారు. గాలిస్తున్న క్రమంలో బుధవారం నిందితుడు చోరీ చేసిన నగలు అమ్మడానికి వెళుతుండగా అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.70 లక్షలు విలువ చేసే 1419 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 308 గ్రాముల రోల్డుగోల్డు వడ్డాణం, 11 గ్రాముల జడపిన్ను, చీరపిన్నులు, రూ.30 వేల నగదు జప్తు చేశారు. బాధితులు 2.5 కిలోల వరకు బంగారు వస్తువులు చోరీకి గురైనట్లు చెప్పారన్న ప్రశ్నకు పోలీసులు బదులిస్తూ రోల్డుగోల్డు వస్తువులు కలుపుకొని చెప్పి ఉండవచ్చని అంటున్నారు. కిలోల కొద్దీ వెండి వస్తువులు పోయినట్లు తొలుత బాధితులు ఫిర్యాదు చేసినా, తర్వాత ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారన్నారు. విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేశామని, దాన్ని న్యాయస్థానంలో అందిస్తామని ఎస్పీ వివరించారు.
తీగలాగితే మూడేళ్ల కిందటి చోరీ: కొత్తపేట చోరీ కేసులో బంగారు ఆభరణల లెక్క తేలకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, నిందితుడు 2021లో గుంటూరువారితోటలోని ఓ ఇంట్లో చేసిన దొంగతనం బయటపడింది. ఆ కేసులో 150 గ్రాముల బంగారు వస్తువులు జప్తు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడిపై హైదరాబాద్ ప్రాంతాల్లో 77 పైగా కేసులుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 13 నేరాలు చేశాడని, గుంటూరులో రెండు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అతడిపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.