తాడేపల్లిగూడెం, న్యూస్ లీడర్, జూలై 13 అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదని.. పేదల బతుకులు మార్చాలనే వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో జనసేన నాయకులు, వీర మహిళలతో పవన్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకే పోరాడుతున్నట్లు చెప్పారు. ‘‘రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకొని ముందుకు వెళ్తున్నాం. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలి. మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. పేదల బతుకులు మార్చాలని వచ్చా. నేను, నా కుటుంబం ఎందుకు విమర్శలు ఎదుర్కోవాలి? సమాజంపై ప్రేమతో నా ప్రాణం, కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చా. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు.. సచివాలయ వ్యవస్థ దేనికి? రాష్ట్రంలో అవినీతి నిత్యకృత్యమైపోయింది. నా అభిమాని అయినా సరే.. మాన, ప్రాణాలకు భంగం కలిగిస్తే శిక్షించాలి’’ అని పవన్ అన్నారు.