డొమినికా, న్యూస్‌లీడర్, జూలై 13: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. తొలుత విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (30), యశస్వి జైస్వాల్ (40) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 70 పరుగుల వెనుకంజలో ఉంది. విండీస్ ప్లేయర్లలో అరంగేట్ర ఆటగాడు అథనేజ్ (47) మినహా మిగతావారు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. బ్రాత్ వైట్ (20), జేసన్ హోల్డర్ (18), బ్లాక్ వుడ్ (14), త్యాగ్‌నారాయణ్ చందర్ పాల్ (12), రఖీమ్ కార్నివాల్ (19లి) పరుగులు చేశారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. జడేజా 3, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 10 ఓవర్లకు 29/0తో నిలవడంతో మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ, నిలకడగా ఆడుతున్న త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (12)ను అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేసి విండీస్ పతనానికి నాంది పలికాడు. తర్వాత విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రాత్‌వైట్ (20).. అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు చిక్కాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో రీఫర్ (2) వికెట్ కీపర్ ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. లంచ్ బ్రేక్‌కు ముందు బ్లాక్‌వుడ్(14) జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో బ్లాక్‌వుడ్ పెవిలియన్ బాటపట్టాడు.
రికార్డులు బద్దలుకొట్టిన అశ్విన్..
ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. డోమినియాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు ఈ ఘనతను సాధించాడు. తన స్పిన్ మాయాజాలంతో విండీస్ బ్యాటర్లకు చమటలు పట్టించాడు. అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ ను కుప్పకూల్చాడు. టెస్టు క్రికెట్లో ఆర్ అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్ 32 సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (67), షేన్ వార్న్ (37), రిచర్డ్ హడ్లీ (36), అనిల్ కుంబ్లే (35), రంగనా హెరాత్ (34) ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయడంలో కూడా అశ్విన్ రికార్డుకెక్కాడు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయగా.. అశ్విన్ 95 సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (88), పేసర్ మహ్మద్ షమీ (66) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.