‘‘నేను ప్రేమించిన అమ్మాయి కళాశాల ఎందుకు మానేసింది’’నాకు సమాచారం చెప్పాలంటూ మిగతా విద్యార్థినులను వేధిస్తున్న ఒక ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు, వార్డు వాలంటీరుపై కదిరి పట్టణంలోని అమృతవల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతి, విద్యార్థినులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు వివరాలు.. గతంలో అమృతవల్లి కళాశాలలో పనిచేసిన కామర్స్ అధ్యాపకుడు నాగరాజు డిగ్రీ విద్యార్థినిని ప్రేమిస్తున్నట్లు మిగతావారికి చెప్పేవాడు. ఈ నేపథ్యంలో విద్యార్థిని తల్లిదండ్రులు ఆమెను కళాశాల మాన్పించారు.
కొద్దిరోజుల తరువాత అధ్యాపకుడు అమృతవల్లి కళాశాలలో మానేసి, మరో కాలేజీలో చేరాడు. తను ప్రేమించిన అమ్మాయి కళాశాలకు ఎందుకు రావడం లేదో సమాచారం చెప్పాలంటూ గతంలో పనిచేసిన విద్యార్థినులకు ఫోన్ చేయడం, బజారులో కనిపించినప్పుడు అడిగేవాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు ప్రిన్సిపల్ వెంకటపతికి చెప్పారు. దీంతో పద్ధతి మార్చుకోవాలని ఆయన నాగరాజును హెచ్చరించారు. మార్పు కనిపించకపోవడంతో ప్రిన్సిపల్ విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థినులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నాగరాజుపై ఫిర్యాదు చేశారు.
సదరు అధ్యాపకుడు కదిరి మున్సిపాలిటీ 34వ వార్డులో వాలంటీరుగా కూడా పనిచేస్తున్నాడు. అధ్యాపకుడిపై ఫిర్యాదు విషయాన్ని అర్బన్ సీఐ మధు దృష్టికి తీసుకెళ్లగా ప్రిన్సిపల్, విద్యార్థినుల నుంచి ఫిర్యాదు అందలేదన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందలేదని, దీనిపై పరిశీలించి వాస్తవమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.