సైబర్ నేరగాళ్లు గ్రామీణులపైనా వల విసురుతున్నారు. సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందని వారి వివరాలు సేకరిస్తూ నేరుగా వారికే ఫోన్ చేసి వ్యక్తిగత, బ్యాంకు వివరాలు తీసుకుని బ్యాంకు ఖాతాలో నగదును ఊడ్చేస్తున్నారు. ఈ తరహాలోనే మాడుగుల తుడుం వీధికి చెందిన తాపీ మేస్త్రీ పసగడుగుల సూరిబాబు భార్య ఈశ్వరమ్మ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 వేలు మాయం చేశారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ప్రభుత్వ అధికారినంటూ ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం ఫోన్ చేశాడు. మీకు జగనన్న చేయూత పథకం డబ్బులు రెండు పర్యాయాలు రాలేదు కదా అని అడిగారు. విద్యుత్తు బిల్లు అధికంగా రావడమే కారణమని మీ రికార్డులు పరిశీలిస్తే తెలుస్తోందన్నాడు. నాతోపాటు పక్కనే ఉన్న వాలంటీరుతోనూ మాట్లాడాడు. చేయూత డబ్బు బ్యాంకు ఖాతాలో పడకపోతే మీరేం చేస్తున్నారంటూ వాలంటీరును గద్దించినట్లు మాట్లాడాడు. చేయూత డబ్బులు ఇప్పుడే మీ బ్యాంకు ఖాతాలో పడేలా చూస్తా, ఫోన్ పే నంబరు చెప్పండని అడిగాడు.
అతడు ఫోన్ చేసినప్పుడు నంబరుతోపాటు సీఎం జగన్ చిత్రం కనిపించడంతో ప్రభుత్వ అధికారేనని నమ్మి వివరాలు చెప్పా. కొద్దిసేపటికే రెండుసార్లుగా రూ.15 వేలు బ్యాంకు ఖాతా నుంచి విత్డ్రా అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింద’ని ఈశ్వరమ్మ వాపోయారు. ఈ విషయం సర్పంచి కళావతి దృష్టికి తీసుకువెళ్లగా.. ‘అపరిచితులు ఎవరు ఫోన్ చేసినా.. వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వవద్దంటూ’ వాలంటీర్ల ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పోస్టు చేయించారు.