ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 14 : డోపింగ్ నిరోధక నిబంధనలను పాటించనందుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఏజెన్సీ ఆమెకు రెండు వారాల గడువిచ్చింది.
డోపింగ్ నిరోధక నియమాలను పాటించడంలో మీరు (వినేశ్) విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో మీ పేరును చేర్చినట్లు 2022, మార్చి, 2022, డిసెంబరులో మీకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపించాం. దీంతో యాంటీ డోపింగ్ నిబంధనల కింద ప్రతి మూడు నెలలకు ముందు మీరు ఎక్కడున్నారన్న విషయాన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏ రోజు ఎక్కడుంటారన్న స్పష్టమైన సమాచారాన్ని కూడా అందించాలి. మీరు చెప్పిన ప్రదేశంలో చెప్పిన సమయానికి డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాలి అని ఏజెన్సీ ఆ నోటీసుల్లో పేర్కొంది.
మీరు ఇటీవల ఇచ్చిన ఫైలింగ్‌లో జూన్ 27న ఉదయం 10 గంటలకు హరియాణాలోని సోనిపట్‌లో టెస్టింగ్‌కు అందుబాటులో ఉంటారని తెలిపారు. అయితే ఆ సమయానికి డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్లు అక్కడకు చేరుకోగా, అక్కడ మీరు లేరు అని ఏజెన్సీ పేర్కొంది. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే అవుతుంది అని తాజాగా ఇచ్చిన నోటీసులో తప్పుపట్టింది. తమ నోటీసుపై 14 రోజుల్లోగా తన వివరణ ఇవ్వాలని వినేశ్ ఫొగాట్‌ను జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
రెజ్లింగ్ సమాఖ్య తాత్కాలిక అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఇటీవల రెజర్లు చేపట్టిన ఆందోళనలో వినేశ్ ఫొగాట్ కీలకంగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నోటీసులు జారీ చేయడం చర్చనీంశమైంది. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల పలు టోర్నమెంట్లకు ఫొగాట్ దూరంగా ఉంటోంది. కాగా, గురువారం నుంచి మొదలైన బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్ 2023 పోటీల్లో ఫొగాట్ పాల్గొననుంది.